Pawan Kalyan : కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అవసరం లేదు.. పవన్ కల్యాణ్ సంచలనం..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అవసరం లేదు.. పవన్ కల్యాణ్ సంచలనం..!
Pawan Kalyan : ఏపీ రాజకీయాలు ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ నువ్వా నేనా అన్న రీతిలో రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో బాగా కాక రేపుతున్న అంశం ఏంటంటే రిజర్వేషన్లు. మొన్న జగన్ మాట్లాడుతూ టీడీపీ కూటమి గనక ఏపీలో అధికారంలోకి వస్తే మైనార్టీలకు రిజర్వేషన్లు తీసేస్తారని ఆరోపించారు. అంతే కాకుండా తాను సీఎం అయితే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తానంటూ వ్యాఖ్యానించారు జగన్. కాగా ఇదే అంశంపై ఎన్నటి నుంచో పెద్ద చర్చ జరుగుతున్నా సరే పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.
Pawan Kalyan బీజేపీకి మద్దతు..
అయితే తాజాగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడారు. తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధమైన కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ ముస్లింలకు, కాపులకు రిజర్వేషన్లు అవసరం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు రిజర్వేషన్లను తీసేస్తామని ఎప్పటి నుంచో బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడటం వారి వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినట్టు అయింది. కాగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లు కావాలని అన్ని వర్గాల వారు కోరుకుంటారని అన్నారు.
కానీ అందరికీ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని.. కాబట్టి కోరుకున్న అన్ని వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించడం మాత్రం సాధ్యం కాదని అంటున్నారు పవన్ కల్యాణ్. ఇక కాపులకు కూడా రిజర్వేషన్లు కావాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నారని.. కానీ అది సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలు మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వమని చెబితే మీరేం నిరాశ పడట్లేదా అని యాంకర్ ప్రశ్నించారు. దానికి పవన్ కల్యాన్ మాట్లాడుతూ.. ఇందులో నిరాశ ఏమీ లేదని చెప్పుకొచ్చారు. అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కాపు ఓటర్లను నమ్ముకుని బరిలోకి దిగుతున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు అదే కాపు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పడం సంచలనంగా మారిపోయింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ మీద ముస్లింలు, కాపులు తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది.