నెమ్మదించిన పిల్లి సుభాష్ జనసేన లోకీ నో.. జగన్ తోనే పయనం తేల్చేశారు..!!
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం జగన్ స్పందించారు. అక్కడ స్థానిక నేత వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ కి మంత్రి చెల్లుబోయిన వేణు మధ్య నువ్వా నేనా అన్నట్టు వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని పిల్లి సుభాష్ మీడియా సమావేశం నిర్వహించి పార్టీ విడబోతున్నట్లు వచ్చే ఎన్నికలలో తన కుమారుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాడని ప్రకటించారు. ఈ పరిణామాలపై దృష్టి పెట్టిన సీఎం జగన్…పిల్లి సుభాష్ తో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది.
దీంతో నెమ్మదించిన సుభాష్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి.. తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు జగన్ తోనే అడుగులు వేయబోతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో పార్టీ వీడుతున్నానని తీవ్రమైన పదాలు ఉపయోగించినందుకు ముఖ్యమంత్రికి మీడియా సమక్షంలో క్షమాపణలు తెలిపారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు జరుగుతున్నా అవమానాలు వలన తాను ఆవేదన చెందినట్లు చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. అంతేకాదు తాను జనసేనలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని పిల్లి సుభాష్ ఖండించారు. జగన్ ఓదార్పు యాత్ర చేపట్టిన నాటి నుంచి ఆయన వెన్నంటే ఉన్నానని వైసీపీ పార్టీ నిర్మాణంలో.. పాలుపంచుకున్నట్లు స్పష్టం చేశారు.
వైసీపీ తన సొంత పార్టీ అని తన చేతులతో నిర్మించిన పార్టీ అని వివరణ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు తనకు ఏ లోటు చేయలేదని.. తనకు వ్యక్తిగత అవసరాలు ఏమి లేవని స్పష్టం చేశారు. ఏ గ్రామంలోనూ కనీసం వాలంటీర్ను కూడా తాను నియమించలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మంత్రి వేణు తన పని తాను చేసుకుంటారు నా పని నేను చేసుకుంటాను అంటూ.. పార్టీ కోసం కృషి చేస్తానని పిల్లి సుభాష్ స్పష్టం చేయడం జరిగింది.