Karnataka Elections : కర్నాటక ఎన్నికల్లో గెలుపు ఎవరిదీ?
Karnataka Elections : కర్నాటక ఎన్నికల గురించే ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది. ప్రస్తుతం కర్నాటక ఎన్నికలపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. నువ్వా, నేనా అన్నట్టుగా కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం కర్నాటకలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి తమ సత్తా మరోసారి చాటాలని బీజేపీ తెగ తాపత్రయపడుతోంది.
ప్రతి పార్టీ మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తున్నాయి. ప్రధాని మోదీ కూడా కర్నాటకలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీజేపీని గెలిపించాలంటూ ప్రజలను వేడుకుంటున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా కర్నాటకలో ఎన్నికల కోసం ప్రచారంలో పాల్గొన్నారు. పోలింగ్ కు ఇంకా మూడు రోజులే సమయం ఉండటంతో అందరి కన్ను ప్రస్తుతం కర్నాటక మీద పడింది. ఎన్నికలు ఇంకా పూర్తికాలేదు సర్వే సంస్థలు ఇప్పటి నుంచే ఎన్నికల ఫలితాలపై నివేదికను బయటపెడుతున్నాయి.
Karnataka Elections : సర్వే సంస్థలు ఏం చెబుతున్నాయి?
పలు సర్వే సంస్థలు పలు రకాలుగా ఏ పార్టీ గెలుస్తుందో చెబుతున్నాయి కానీ.. ఏ పార్టీకి స్పష్టమైన అధిక్యత వస్తుందో ఏ సర్వే సంస్థ కూడా క్లారిటీగా చెప్పడం లేదు. మరోసారి కర్నాటకలో బీజేపీ ప్రభుత్వమే రావడంతో పాటు కర్నాటకలో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది అంటూ ఓ సర్వే నివేదిక వచ్చింది. సీ ఓటర్ అనే సంస్థ మాత్రం కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయంటోంది. 224 స్థానాల్లో 113 సీట్లు మ్యాజిక్ ఫిగర్. అందులో కాంగ్రెస్ కు 110 సీట్ల దాకా వస్తాయట. బీజేపీకి 80 వరకు వస్తాయని, ఈసారి జేడీఎస్ పార్టీ హవా తగ్గిందని.. ఆ పార్టీకి 30 సీట్లలోపే వస్తాయని అంటున్నారు. చూద్దాం మరి కర్నాటకలో ఏ పార్టీ గెలుస్తుందో.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో.