Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా వారాహి యాత్ర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలపైనే చర్చ నడుస్తోంది. దానికి కారణం.. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు. అధికార పార్టీపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా కూడా వెంటనే వైసీపీ నేతలు రివర్స్ అటాక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. పవన్ ఏ విమర్శ చేసినా వెంటనే స్పందిస్తున్నారు. కానీ.. ఇదంతా వైసీపీ కావాలనే.. ఒక వ్యూహం ప్రకారం ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థనే పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థను ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ తో పవన్ పోల్చారు. దీంతో వైసీపీ కూడా తీవ్రస్థాయిలో ఆ విషయంపై స్పందించింది. పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రులు, వైసీపీకి చెందిన ఇతర నేతలు ఎదురు దాడి చేయడం ప్రారంభించారు. అటు పవన్ కళ్యాణ్ విమర్శించడం ఆలస్యం.. వెంటనే ఏపీ మంత్రులు పవన్ వ్యాఖ్యలపై రివర్స్ అటాక్ చేయడం పరిపాటి అయిపోయింది. దీంతో పవన్ కు వైసీపీ నేతలు చేసే హడావుడి ద్వారానే ఎక్కువ పాపులారిటీ వచ్చేసింది. అయితే.. వాలంటీర్ల వ్యవస్థను సంఘ విద్రోహ శక్తులతో పవన్ కళ్యాణ్ పోల్చారు. దాన్నే వైసీపీ.. పవన్ పై దాడి చేసే అస్త్రంగా మార్చుకుంది.

Pawan Kalyan : టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీకి మైనస్సేనా?
ఒకవేళ టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఏదైనా నష్టం వాటిల్లుతుందనే అనుమానాలు వస్తున్నాయి. అందుకే రెండు పార్టీల మధ్య ఒక పోటీ వాతావరణాన్ని సృష్టించేందుకే పవన్ కళ్యాణ్ వైపు వైసీపీ తన ఫోకస్ ను షిఫ్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ కు కూడా అవసరానికి మించి ప్రాధాన్యత ఇస్తుండటం వెనుక బలమైన కారణం వేరే ఉంది. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి పోటీ చేస్తే ఏం జరుగుతుంది అనే దానిపై కూడా వైసీపీ తీవ్రంగా సమాలోచనలు చేస్తోంది. ఏది ఏమైనా.. పవన్ పై ఎక్కు పెట్టేందుకు అన్ని రకాల అస్త్రాలను వైసీపీ సిద్ధం చేసుకుంటోంది.