Bedurulanka 2012 Movie Review : హీరో కార్తికేయ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఆర్ఎక్స్ 100. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీసును ఊపేసింది. కార్తికేయకు భారీ హిట్ ను ఇవ్వడంతో ఆ సినిమా తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ.. ఆర్ఎక్స్ 100 సినిమా హిట్ ఇచ్చినంతగా మరే సినిమా హిట్ ఇవ్వలేదు. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత 90 ఎంఎల్, గుణ 369, చావు కబురు చల్లగా, హిప్పీ, రాజా విక్రమాక్క లాంటి సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాల్లో విలన్ గానూ నటించాడు. అయినా కూడా ఆయనకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు.
అయినా కూడా కార్తికేయ క్రేజ్ మాత్రం తగ్గలేదు. కొన్ని సినిమాలు కమర్షియల్ గా యావరేజ్ హిట్ టాక్ ను సంపాదించుకున్నాయి. తాజాగా ఆయన హీరోగా నటించిన మూవీ బెదురులంక 2012. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కార్తికేయ సరసన హీరోయిన్ గా నేహా శెట్టి నటించింది.

Bedurulanka 2012 Movie Review సినిమా పేరు : బెదురులంక 2012
నటీనటులు : కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్ తదితరులు
దర్శకత్వం : క్లాక్స్
బ్యానర్ : లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత : ముప్పలనేని రవీంద్ర బెనర్జీ
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
విడుదల తేదీ : 25 ఆగస్టు 2023
Bedurulanka 2012 Review : సినిమా కథ ఇదే
ఈ సినిమా కథ 2012 నేపథ్యంలో జరుగుతుంది. బెదురులంక గ్రామానికి చెందిన శివ(కార్తికేయ) ఏ పనీ పాట లేకుండా గాలి తిరుగుడు తిరుగుతూ ఉంటాడు. తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా జీవిస్తుంటాడు. కొన్నేళ్లు హైదరాబాద్ లో గ్రాఫిక్స్ డిజైనర్ గా పని చేసి ఆ జాబ్ మానేసి బెదురులంకకు వచ్చి అక్కడే ఉంటాడు. అయితే.. అప్పటికే ఆ ఊరిలో యుగాంతం రాబోతోంది అంటూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. యుగాంతం రాబోతోందని తెలుసుకున్న భూషణం(అజయ్ ఘోష్) ఆ గ్రామ జనాలను మోసం చేసేందుకు పెద్ద ప్లాన్ వేస్తాడు. దాని కోసం అదే ఊరికి చెందిన బ్రహ్మం(శ్రీకాంత్ అయ్యంగార్), డేనియల్(ఆటో రాంప్రసాద్) తో కలుస్తాడు. గ్రామస్తులందరూ తమ దగ్గర ఉన్న బంగారం మొత్తం తెచ్చి ఇవ్వాలని.. దానితో శివలింగాన్ని తయారు చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని నమ్మిస్తాడు. దీంతో అందరూ తమ దగ్గర ఉన్న బంగారం ఇస్తారు కానీ.. శివ మాత్రం ఇవ్వడు. దీంతో శివను ఊరిలో నుంచి వెలేస్తారు. ఇదంతా మూఢనమ్మకం అని.. ఊరి ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాన్ని వదిలించడం కోసం శివ ఏం చేస్తాడు. మధ్యలో ప్రెసిడెంట్ కూతురు చిత్ర(నేహాశెట్టి)తో ఎలా ప్రేమలో పడతాడు. ఆమెతో లవ్ ట్రాక్ ఎలా నడిపిస్తాడు.. అనేదే మిగితా కథ.
Bedurulanka 2012 Review : విశ్లేషణ
2012 లో యుగాంతం వస్తుందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. నిజానికి అది ఒక పుకారు అయినప్పటికీ చాలా రోజుల పాటు ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దాన్నే ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తీశారు. అయితే.. 2012 యుగాంతాన్ని ఆసరాగా చేసుకొని బెదురులంక గ్రామంలో ఏం జరిగింది అనేదానిపై కథను అల్లుకున్నాడు డైరెక్టర్. అలాగే.. మూఢనమ్మకాలను కూడా జనాలు ఎలా గుడ్డిగా నమ్ముతారు అనేది ఈ కథ. నిజానికి.. ఇది ఒక సరికొత్త సబ్జెక్ట్ అనే చెప్పుకోవాలి. మూఢనమ్మకాల పేరుతో ప్రజలు ఎలా మోసపోతున్నారో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టుగా వివరించారు. అలాగే.. లవ్ ట్రాక్ ను కూడా ఈ సినిమాలో ఇరికించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కార్తికేయ మాత్రం ఈ సినిమాలో చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. సినిమాను తన భుజాల మీద మోశాడు. కామెడీ, యాక్షన్ సీన్లలో కార్తికేయ అదరగొట్టేశాడు. చిత్రగా హీరోయిన్ నేహాశెట్టి అదరగొట్టేసింది. ఇక.. తమ పాత్రల్లో మిగితా నటులు కూడా ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్
కార్తికేయ నటన
సినిమాటోగ్రఫీ
ఎడిటింగ్
అజయ్ ఘోష్ నటన
మైనస్ పాయింట్స్
హీరోయిన్ పాత్ర నిడివి
పాటలు
దితెలుగున్యూస్ రేటింగ్ : 2.75/5