IPL 2022 : ఐపీఎల్ 2022 నిర్వహణకు బీసీసీఐ నయా ప్లాన్.. కరోనా కట్టడికి కీలక నిర్ణయం!
IPL 2022 : కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఐపీఎల్ 2021ని బీసీసీఐ యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే. బయోబబుల్ భద్రత నడుమ ఆటగాళ్లు అందరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పార్టిసిపేట్ చేశారు. ప్రతీయేడు సమ్మర్ హాలీడేస్ అనగా మార్చి లేదా ఏప్రిల్‌లో ఐపీఎల్ జరిగేది. కానీ కరోనా కారణంగా గతేడాది చాలా ఆలస్యంగా మ్యాచులు జరిగాయి. కానీ ఈ ఏడాది -2022లో మాత్రం సమ్మర్ హాలీడేస్‌లో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధం అవుతోంది. 2021లో లాగా ఈసారి కూడా ఐపీఎల్ కరోనా బంధనంలో చిక్కుకోకుండా బీసీసీఐ ‘ప్లాన్ బి’ని సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ రన్ అవుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. వంద నుంచి ఏకంగా వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. వైద్య సిబ్బందికి సెలవులను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేశాయి. థర్డ్ వేవ్ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బీసీసీఐ మొత్తం 10 జట్లకు హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు నిర్వహించేందుకు సుముఖంగా లేదని సమాచారం. అన్ని మ్యాచులను ముంబైలోని వాంఖడే, సీసీఐ, డీవై పాటిల్ మైదానాల్లో జరిపేందుకు సన్నద్ధం అవుతోంది. గతేడాది లాగా యూఏఈ వెళ్లేందుకు బీసీసీఐ ఇష్టపడటం లేదు.
IPL 2022 : ఈసారి యూఏఈ ప్లాన్ లేనట్టే..
ప్రస్తుతం బీసీసీఐ ప్లాన్ ‘బి’ కోసం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. క్రిక్‌బజ్ రిపోర్టు ప్రకారం.. కరోనా విజృంభిస్తున్ననేపథ్యంలో బీసీసీఐ ముంబైలో మాత్రమే టోర్నమెంట్‌ను నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈసారికి హోమ్ గ్రౌండ్స్‌కు ప్రయారిటీ ఇవ్వకుండా క్రీడాకారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అంతేకాకుండా టోర్నమెంట్ తేదీని ఒక వారం ముందుగానే మార్చేందుకు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. దీని ప్రకారం ఏప్రిల్ 2కు బదులుగా మార్చి 25 నుంచే ఐపీఎల్-2022ను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.