T20 World Cup : టీ20 ప్రంపచ కప్ సెమీస్‌లో ఐసీసీ అలాంటి నిర్ణయం తీసుకుందేంటి.. మనకు గట్టి దెబ్బే..!
T20 World Cup : అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ అందినట్టే అంది చేజారింది. ఈ సారి టీ 20 వరల్డ్ కప్ దక్కించుకోవాలనే కసితో టీమిండియా ఉంది. అందుకోసం ఇటీవల భారత సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఈ మేరకు రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టు ప్రకటించింది. ఇందులో వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు అవకాశం ఇచ్చింది. వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించింది. ఐపీఎల్‌లో రాణిస్తున్న శివమ్ దూబె, యుజ్వేంద్ర చాహల్‌లకు జట్టులో అవకాశం కల్పించింది. ఇక షెడ్యూల్‌ని కూడా ఇప్పటికే ప్రకటించడం మనం చూశాం.
T20 World Cup ఈ మార్పు దేనికి సంకేతం..
జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ జూన్ 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. అయితే టోర్నీలో జూన్ 26, 27 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్ లు జరగనుండగా, వీటి షెడ్యూల్ విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టీ20 ప్రపంచ కప్‌లో రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్ 4గంటలకి బదులుగా 8గంటలకి షెడ్యూల్ చేశారు. అంటే దీనికి రిజర్వ్ డే లేదని తెలుస్తుంది. దీనికి బదులు మ్యాచ్ షెడ్యూల్ చేయబడిన రోజునే మ్యాచ్‌ని పూర్తి చేయాలని ఐసీసీ ఆలోచన చేస్తున్నట్టుగా ఓ టాక్ వినిపిస్తుంది. అయితే అలా చేయడానికి కారణం కూడా లేకపోలేదు. రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే అంటే జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగడమే ఇందుకు కారణం.
మొదటి సెమీ ఫైనల్ జూన్ 26న ట్రినిడాడ్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో వర్షం కురిస్తే మాత్రం రిజర్వ్ డే ఉంటుంది. రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ జూన్ 27న గయానాలో జరుగుతుంది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఒకవేళ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడితే ఈ టీ20 మ్యాచ్ నిడివి ఎనిమిది గంటలకి చేరుతుంది. కాబట్టి రిజర్వ్ డే అవసరం లేదంటోంది ఐసీసీ. మరి ఈ మార్పులు టీమిండియాకి ఏమైన ప్రతి కూలంగా మారే అవకాశం ఉందా అని టెన్షన్ పడుతున్నారు క్రికెట్ అభిమానులు.