Rashid Khan : ఎస్ఆర్‌హెచ్‌పై పగ తీర్చుకుంటున్న రషీద్.. ఆ బాదుడేందయ్యా సామీ…!
Rashid Khan: ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ చాలా రంజుగా సాగుతుంది. జట్ల మధ్య ఫైట్ హోరా హోరీగా సాగుతుంది. గత రాత్రి గుజరాత్ టైటాన్స్, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సంచలన విజయం అందుకుంది. 197 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ మాజీ ఆటగాడు రషీద్ ఖాన్ అదరగొట్టాడు. 11 బంతుల్లోనే 4 సిక్సర్ల సాయంతో 31* పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్‌తో పాత జట్టైన ఎస్‌ఆర్‌హెచ్‌ను విజయానికి దూరం చేశాడు. ఒక రకంగా రషీద్ ఖాన్ ఎస్‌ఆర్‌హెచ్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడంటూ అభిమానులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రషీద్ విధ్వంసం
కొన్ని రోజుల క్రితం ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ కోచ్ విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా రషీద్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందరూ అనుకుంటున్నట్లుగా రషీద్ ఖాన్ పెద్ద టేకర్ ఏమీ కాదని, అతనికి మించిన బౌలర్లు ప్రస్తుతం సన్‌రైజర్స్‌లో ఉన్నారని పేర్కొన్నాడు. రషీద్ ఖాన్ లేకున్నా తాము మ్యాచ్‌లు గెలుస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించాడు.
రషీద్ ఖాన్ ఆడిన తీరు చూస్తుంటే లారా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నట్లుగా అనిపించింది. తన బ్యాటింగ్ పవర్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌కు రుచి చూపించి.. ఒక రకంగా లారాకు కౌంటర్ ఇచ్చాడంటూ అభిమానులు అభిప్రాయపడ్డారు. రానున్న రోజులలో రషీద్ పూర్తి నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో విజయానికి 22 పరుగులు అవసరం కాగా.. తెవాటియా, రషీద్ ఖాన్‌లు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఒక దశలో మ్యాచ్ ఎస్‌ఆర్‌హెచ్‌వైపు మొగ్గుచూపినప్పటికి.. రషీద్ వచ్చిన తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటికే దాటిగా ఆడుతున్న తెవాటియాకు(21 బంతుల్లో 40*, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రషీద్ ఖాన్ తోడవ్వడంతో గుజరాత్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ స్థానాన్ని ఆక్రమించింది.