RCB : ఇది కదా ఆర్సీబీ అంటే.. ప్లేఆఫ్స్‌కి రాదనుకున్న జట్టు ఇప్పుడు టైటిల్ రేసులో..!
RCB : ఫస్టాఫ్‌లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి ఈ టోర్నీ నుండి బయటకు వెళుతుంది అనుకున్న ఆర్సీబీ గత రాత్రి చెన్నైని ఓడించి ప్లేఆఫ్స్‌కి వెళ్లింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై 27 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. వరుసగా ఆరు మ్యాచ్ ల్లో ఓటమిపాలైన ఆ జట్టు, అక్కడ్నించి వరుసగా ఆరు మ్యాచ్ ల్లో నెగ్గి ప్లేఆఫ్స్ లోకి ప్రవేశించడం సామాన్యమైన విషయం కాదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సాధించిన విజయం ఆ జట్టు అచంచలమైన పట్టుదలకు నిదర్శనం. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.
RCB ఆ కసి ఉండాలి..
విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47), గ్లేన్ మ్యాక్స్‌వెల్(5 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16), ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) , రజత్ పటీదార్(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 41), కామెరూన్ గ్రీన్(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకి మంచి స్కోరు దక్కేలా చేశారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్, తుషారా దేశ్‌పాండే తలో వికెట్ పడగొట్టారు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై పోరాడి ఓడింది. ఫలితంగా సీఎస్‌కే టోర్నీ నుంచి నిష్ర్కమించింది. చెన్నై ప్లేయర్లలో రచిన్ రవీంద్ర (61; 37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేయగా, రవీంద్ర జడేజా (42 నాటౌట్) అజేయంగా నిలిచాడు.
ప్లేఆఫ్స్ బెర్తు కోసం (విజయం కోసం కాదు) చెన్నై చివరి ఓవర్లో 6 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా… యశ్ దయాళ్ విసిరిన ఆ ఓవర్ తొలి బంతికి ధోనీ ఓ సిక్స్ కొట్టి ప్రమాద ఘంటికలు మోగించాడు. కానీ ఆ తర్వాతి బంతికి ధోనీ అవుట్ కావడంతో బెంగళూరు జట్టు ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత బరిలో దిగిన శార్దూల్ ఠాకూర్ భారీ షాట్లు ఆడలేకపోయాడు. శార్దూల్ ఓ సింగిల్ తీయడంతో బ్యాటింగ్ క్రీజులోకి వచ్చిన జడేజా సైతం చివరి రెండు బంతుల్లో ఒక్క పరుగు తీయలేకపోయాడు. మొత్తమ్మీద యశ్ దయాళ్ ఆ ఓవర్ లో కేవలం 7 పరుగులు ఇచ్చి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ రోజు సన్ రైజర్స్ × పంజాబ్ కింగ్స్… రాజస్థాన్ రాయల్స్ × కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ ల ఫలితాల అనంతరం ప్లేఆఫ్స్ లో ఎవరు ఎవరితో ఆడతారు అనే దానిపై క్లారిటీ వస్తుంది.