Shahid Afridi : క్రికెట్ గురించి ఏమీ తెలియనోడు – మొత్తం చెడగొట్టాడు… పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఫైర్..!
Shahid Afridi : భారత్ -పాకిస్తాన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. పలు కారణాల వలన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య గత తొమ్మిదేళ్లుగా ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఇరుదేశాల మధ్య చివరి టీ20, వన్డే సిరీస్ 2012 డిసెంబర్‌లో జరిగింది. టీ20 సిరీస్ 1-1తో సమం కాగా, వన్డే సిరీస్‌ను పాక్ 2-1తో కైవసం చేసుకున్నది. 2007-08 సీజన్ నుంచి టెస్ట్ సిరీస్‌లో పోటీపడింది లేదు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత జట్టు పాక్ గడ్డపై అడుగుపెట్టలేదు. ఇందుకు కారణం నియంత్రణ రేఖ వెంట నిరంతర కాల్పుల విరమణ ఉల్లంఘనలు, 2019లో పుల్వామా దాడి . వీటివలన పరిస్థితులు మరింత దిగజారాయి. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరుజట్లు పోటీపడింది లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్‌లో మాత్రమే ఇరుజట్లు తలపడ్డాయి.
భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ అంటనే తెలియకుండానే ఓ హై ప్రెషర్ ఏర్పడుతుంటుంది. అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు గురి అవుతుంటారు. రెండు జట్ల మధ్య మ్యాచ్‌గా కంటే రెండు దేశాల మధ్య జరిగే యుద్ధంగా భావిస్తుంటారు ఫ్యాన్స్. వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో ఆసియా కప్ జరగనుండగా, ఆ గడ్డపై ఇండియా జట్టు అడుగుపెట్టదని జైషా అన్నారు. 2023 ఆసియా కప్ తటస్థ వేదికలో జరుగుతుందని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. జైషా మాట్లాడుతూ- ఆసియా కప్ 2023 తటస్థ వేదికపై జరుగుతుంది. మా జట్టును పాకిస్థాన్‌కు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. కాబట్టి మేం దానిపై వ్యాఖ్యానించలేం. కానీ 2023 ఆసియా కప్ కోసం టోర్నమెంట్ తటస్థ వేదికపై నిర్వహించాలని నిర్ణయించాం అని పేర్కొన్నారు.
Shahid Afridi : ఏం తెలుసని..
రెండు నెలల కిందట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌లో భారత్ – పాకిస్తాన్ తలపడ్డాయి మళ్లీ రెండు నెలల వ్యవధిలోనే మరోసారి ఈ రెండు జట్లు ఢీ కొట్టబోతోన్నాయి.. టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ వేదికగా. ఈ ఆదివారం ఈ రెండు జట్లు మ్యాచ్ ఆడబోతోన్నాయి. అయితే ఆసియా కప్ కోసం భారత జట్టు పాక్‌కి వెళ్లదని జై షా చేసిన ప్రకటనను పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది తప్పుపట్టారు. 12 నెలల్లో భారత్-పాకిస్తాన్ మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడిందని, గుడ్ ఫీల్, గుడ్ ఫ్యాక్టర్స్ నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐ కార్యదర్శి ఈ ప్రకటన ఎందుకు చేశారని ప్రశ్నించారు. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ గురించి అనుభవం లేకపోవడమే దీనికి కారణమని అన్నారు.