RBI Cuts Repo : మరోసారి రెపో రేట్ తగ్గించిన RBI ..లోన్ దారులకు గొప్ప శుభవార్త
ప్రధానాంశాలు:
RBI Cuts Repo : మరోసారి రెపో రేట్ తగ్గించిన RBI ..లోన్ దారులకు గొప్ప శుభవార్త...
RBI Cuts Repo : రుణభారంతో బాధపడుతున్న ప్రజలకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరోసారి శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జరిగిన రెండవ ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్ల పై వరుసగా మూడవసారి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 6 శాతంగా ఉన్న రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5 శాతానికి తీసుకురావడం ద్వారా గృహరుణాలు, వాహన రుణాలు, ఇతర వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు తక్కువయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ప్రకటించారు.
RBI Cuts Repo మరోసారి రెపో రేట్ తగ్గించిన RBI
రెపోరేటులో తగ్గింపు నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) తన విధానాన్ని ‘సౌకర్యవంతమైన’ దశ నుంచి ‘తటస్థమైన’ దశకు మార్చింది. బుధవారం ప్రారంభమైన మూడు రోజుల సమీక్ష సమావేశం ముగింపులో ఈ నిర్ణయం వెలువడింది. గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా కొనసాగుతోందని, పెట్టుబడిదారులకు గొప్ప అవకాశాలు అందిస్తున్నదని గవర్నర్ పేర్కొన్నారు. ఇది ఆర్థిక వృద్ధిని మరింత వేగంగా ముందుకు నడిపించడానికి తగిన చర్యగా భావిస్తున్నారు.
ఇప్పటికే ఫిబ్రవరి, ఏప్రిల్ నెలలలో చెరో 25 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీ రేట్లు తగ్గిన నేపథ్యంలో, తాజా సమీక్షలో మరో 50 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో కలిపి మొత్తం 100 బేసిస్ పాయింట్లు తగ్గినట్లైంది. ఈ నేపథ్యంలో చాలా బ్యాంకులు తమ రుణ వడ్డీ రేట్లను పునఃసవరించాయి. ముఖ్యంగా రెపో-లింక్డ్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లు (EBLR), మార్జినల్ కాస్ట్ ఆధారిత లెండింగ్ రేట్లు (MCLR) తక్కువ కావడం వలన రిటైల్, కార్పొరేట్ రుణగ్రహీతలకు ఈఎంఐలు తగ్గుతున్నాయి. దీని వల్ల వినియోగదారులపై ఉన్న ఆర్థిక భారం కొంత తగ్గనుంది.