Damodara Rajanarasimha : కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. తన అనుచరుడికి టికెట్ ఇవ్వలేదని దామోదర రాజనర్సింహ రాజీనామా?
ప్రధానాంశాలు:
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై దామోదర రాజనర్సింహ అసంతృప్తి
పటాన్ చెరు టికెట్ నీలం మధుకి
రాజనర్సింహకు ఫోన్ చేసిన మాణిక్ రావ్ ఠాక్రే
Damodara Rajanarasimha : తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ కల్లోలం స్టార్ట్ అయింది. మొన్నటి వరకు మంచిగానే ఉన్న పార్టీ లీడర్లు ఒక్కసారిగా అధిష్ఠానానికి వ్యతిరేకంగా మారుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్లే పార్టీలోని కొందరు నాయకులు తీసుకునే నిర్ణయాలను ఆమోదించలేకపోతున్నారు. హైకమాండ్ నిర్ణయాన్ని కూడా ధిక్కరిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో తన అనుచరులకు టికెట్ కేటాయించలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ పార్టీ మీద అలిగినట్టు తెలుస్తోంది. తన అనుచరులు పటాన్ చెరులో శ్రీనివాస్ గౌడ్, నారాయణఖేడ్ టికెట్ పట్లోళ్ల సంజీవ్ రెడ్డికి కేటాయించకపోవడంతో దామోదర రాజనర్సింహ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తానని సీనియర్ నేతలకు చెప్పినట్టు సమాచారం. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని మాణిక్ రావు ఠాక్రే ఫోన్ చేసి సముదాయించినట్టు తెలుస్తోంది.
మరోవైపు పటాన్ చెరు టికెట్ కాటా శ్రీనివాస్ గౌడ్ కు కాకుండా నీలం మధుకి కేటాయించడంపై కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. నీలం మధుకు ఎలా కేటాయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటిని కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ముట్టడించారు. ఆ తర్వాత పటాన్ చెరు కాంగ్రెస్ నేతలు శ్రీనివాస్ గౌడ్ కే టికెట్ ఇవ్వాలని గాంధీ భవన్ కు వెళ్లి నిరసన చేపట్టారు. గాంధీ భవన్ గేట్ ముందు ఆందోళన నిర్వహిస్తుండగా రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జ్ చేసి కాటం శ్రీను అనుచరులను చెదరగొట్టారు. కొందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో గాంధీ భవన్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.