Free Travel Effect : ఉచిత ప్రయాణం ఎఫెక్ట్.. రేపటి నుంచి బస్సులన్ని బంద్..!!
Free Travel Effect : తెలంగాణ ప్రజలకు టీఎస్ఆర్టీసీ ప్రైవేట్ బస్సు సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. టీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మహాలక్ష్మి పథకం అద్దె బస్సులకు ఇబ్బంది అవుతుందని, అందుకు సమ్మె చేస్తామని ప్రకటించారు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, రద్దీ పెరిగితే బస్సులు పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలంతా పరిమితికి మించి బస్సు ఎక్కుతున్నారని, దీని వలన బస్సు కెపాసిటీకి మించి ప్రయాణం చేయడం వలన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దీంతో టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సుల యజమానులను ఇవాళ చర్చలకు ఆహ్వానించింది. చర్చలు సానుకూలంగా లేకపోతే సమ్మె యధావిధిగా చేస్తామని యజమానులు హెచ్చరించారు. అయితే టీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సమ్మెపై ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. అధికారంలో రావటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎటువంటి నివేదిక, ఆలోచన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే దీనివలన చాలా ఇబ్బందులు వస్తున్నాయి. టీఎస్ ఆర్టీసి పైన ఆర్థిక భారం పడటమే కాకుండా, కెపాసిటీకి మించి బస్సులు ప్రయాణించవలసి వస్తుంది.
కేవలం మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణ పథకం వలన బస్సులలో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. మగవారు పిల్లలు ప్రయాణించే పరిస్థితి కనపడటం లేదు. అంతేకాకుండా ఉచిత బస్సు ప్రయాణం వలన ఆటో కార్మికులకు ఇబ్బందిగా మారింది. వారు సమ్మె కూడా చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు టీఎస్ఆర్టిసి అద్దె బస్సులు యజమానులు సమ్మెకు దిగారు. కెపాసిటీకి మించి బస్సులు ప్రయాణం చేయటం వలన ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు. దీనిపై ఇవాళ చర్చ జరగనుంది. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు. రేపటి నుంచి బస్సులు బంద్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.