అయోద్యలో కొత్త రామ మందిరం ఉన్నంత కాలం తెలంగాణ పేరు ఈ కారణంగా చిరస్మరణీయంగా నిలిచిపోతుంది
Rama mandiram : అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ జోరుగా సాగుతోంది. హిందువుల ఆరాధ్య దైవం రాముడి ఆలయ నిర్మాణంలో తమవంతు ఉడుతాభక్తి సాయం అందించాలని ప్రజలు భావిస్తున్నారు. దీంతో అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం ఇంటింటి విరాళాన్ని సేకరిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు ప్రకటించింది. కాగా ఈ ఇంటింటి విరాళాల సేకరణను జనవరి 14 నుండి ఫిబ్రవరి 27 వరకు నిర్వహించినట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.
రామమందిర విరాళాల ఇంటింటి సేకరణలో ఫిబ్రవరి 4 నాటికి దేశవ్యాప్తంగా రూ.2,500 కోట్లు సమకూరినట్లు ఆయన తెలిపారు. అయితే దేశంలో ఈ విరాళాలు అందించిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా 9 లక్షల మంది కార్యకర్తలు 4 లక్షల గ్రామాల్లో రామమందిరం నిర్మాణానికై విరాళాలు సేకరించారని, వారందరికీ ఈ సందర్భంగా ట్రస్టు తరఫున ధన్యవాదాలు తెలిపారు. కాగా ప్రస్తుతం ఇంటింటి విరాళాల సేకరణను నిలిపివేశామని, కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే విరాళాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు ఇప్పటికే వేగవంతంగా జరుగుతున్నాయని, రాబోయే మూడేళ్లలో ఈ పనులు పూర్తవుతాయని ట్రస్టు సభ్యులు వెల్లడించారు. రామమందిరం నిర్మాణాంతరం శ్రీరాముడిని దర్శించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రామమందిర నిర్మాణ ట్రస్టు వెల్లడించింది. ఏదేమైనా అయోధ్యం మందిర నిర్మాణానికై విరాళాలు అందించడంలో కూడా తెలంగాణ రాష్ట్రం ముందుండటం నిజంగా విశేషమని హిందూ భక్తులు అంటున్నారు.