Uttar Pradesh | కుల ప్రస్తావనలకు చెక్ .. వాహనాలపై కులాన్ని సూచించే స్టిక్కర్లు ఉండొద్దంటూ హెచ్చరిక
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లో ఇకపై వాహనాలపై, పోలీసు రికార్డుల్లో, పబ్లిక్ నోటీసుల్లో కుల ప్రస్తావన లేకుండా చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోగా, కులపరమైన వివక్షను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

#image_title
హైకోర్టు హెచ్చరికలతో ..
పోలీసు కేసుల రికార్డుల్లో కుల ప్రస్తావన ఉండటం అభ్యంతరకర పరిణామాలకు దారి తీస్తుందని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన యూపీ ప్రభుత్వం, పోలీస్ స్టేషన్లకు, జిల్లా యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కేసుల రిజిస్టర్లలో, అరెస్ట్ డాక్యుమెంట్లు, నోటీసు బోర్డుల్లో నిందితుల కుల వివరాలను చేర్చకూడదని స్పష్టం చేసింది.
వాహనాలపై కనిపించే కులానికి సంబంధించిన స్టిక్కర్లు, నినాదాలు కూడా ఇకపై అనుమతించబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఇవి నిషేధించబడినవి కావడంతో, ఇప్పటి నుంచి ఈ ఉల్లంఘనలకు చలాన్లు విధించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కులాలకు సంబంధించిన బోర్డులు, సంఘ నిర్మాణాలు, లేదా ఓ కులాన్ని పెద్దదిగా చూపే విధంగా ఏర్పాటు చేసే సూచికలపై తీవ్ర నిఘా ఉంచనున్నారు. అంతేకాకుండా, కుల ఆధారిత ర్యాలీలు, పబ్లిక్ ఈవెంట్లు నిర్వహించరాదని స్పష్టం చేశారు.