Revanth Reddy : గుంపు మేస్త్రీ అన్న కేటీఆర్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి..!
ప్రధానాంశాలు:
Revanth Reddy : గుంపు మేస్త్రీ అన్న కేటీఆర్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి..!
Revanth Reddy : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని గుంపు మేస్త్రి అంటూ కేటీఆర్ మాట్లాడారు. డిసెంబర్ 3న గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి అయ్యారని, రైతుబంధు వేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారని, కానీ విదేశాలకు వెళ్లి అబద్దాలు చెబుతున్నారని, దావోస్ ప్రపంచ వేదికపై అసత్యాలు చెప్పారని, రైతు భరోసా గురించి మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని కేటీఆర్ ఆరోపించారు. అబద్దాలు చెప్పినందుకు సీఎం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గుంపు మేస్త్రి పాలనలో ప్రజలు పథకాల కోసం క్యూ కడుతున్నారని, ఆర్టీసీ బస్సులలో మహిళలు సిగపట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. హామీలు ఇచ్చే ముందు ఆలోచించకపోతే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని కేటీఆర్ తెలిపారు.
ఇక తనను గుంపు మేస్త్రి అంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అవును..నేను మేస్త్రినే..మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్ నిర్మించిన మేస్త్రిని అని కౌంటర్ ఇచ్చారు. మిమ్మల్ని గోరి కట్టే మేస్త్రిని నేనే అని హెచ్చరించారు. బిడ్డల్లారా కాసుకోండి..ఈ నెలాఖరులో ఇంద్రవల్లి వస్తున్నాను అంటూ పేర్కొన్నారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బూత్ లెవెల్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , రేవంత్ రెడ్డి , మంత్రులు , ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నెహ్రూ కుటుంబం త్యాగాలతోనే దేశం అభివృద్ధి చెందిందన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని, మోడీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని కోరారు.
కార్యకర్తల కష్టంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తాను సీఎం పదవిలో ఉన్నానని ఆయన తెలిపారు. బిల్లా రంగాలు కేటీఆర్ హరీష్ చాలా మాట్లాడుతున్నారని, చార్లెస్ శోభరాజ్ కేసీఆర్ దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకొని ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ రాజ్యసభ పదవులకు కేసీఆర్ అమ్ముకుంటే తాము మాత్రం ఉద్యమకారులకు పదవులు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కాలేదని అప్పుడే హామీలు అమలు చేయాలని గోల చేస్తున్నారని మండిపడ్డారు. పథకాలను ఫిబ్రవరిలో అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఫిబ్రవరి నెలాఖరులోగా అందరికీ రైతు భరోసా నిధులు అందజేస్తామని రేవంత్ వెల్లడించారు. లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు.