Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ ఖజానా కి షాక్ తగిలిందా ?
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారాలు పుంజుకుంటున్నాయని, నిర్మాణ రంగంలో కార్యకలాపాలు వేగం పెంచుకున్నాయని, కొత్త పరిశ్రమలు వస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్న వేళ.. రాష్ట్ర ఖజానాకు చేరుతున్న ఎస్‌జీఎస్టీ ఆదాయం
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారాలు పుంజుకుంటున్నాయని, నిర్మాణ రంగంలో కార్యకలాపాలు వేగం పెంచుకున్నాయని, కొత్త పరిశ్రమలు వస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్న వేళ.. రాష్ట్ర ఖజానాకు చేరుతున్న ఎస్‌జీఎస్టీ ఆదాయం మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ వరకు రాష్ట్ర సొంత వస్తు సేవల పన్ను (SGST) రాబడిలో ఏకంగా మైనస్ 7 శాతం వృద్ధి నమోదైనట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG), కేంద్ర జీఎస్టీ పోర్టల్ నుంచి వెల్లడైన గణాంకాలు ప్రభుత్వానికి ఊహించని షాక్‌గా మారాయి. సాధారణంగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయం గతేడాదితో పోలిస్తే పెరగాల్సి ఉండగా.. ఏకంగా నెగెటివ్ గ్రోత్‌లోకి వెళ్లడం ఆర్థిక నిపుణులు, ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి, నిర్మాణ రంగంలో కదలిక కనిపిస్తోంది, మార్కెట్‌లో కొనుగోళ్లు పెరిగినట్లు క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. అయినప్పటికీ ఆ ప్రభావం ప్రభుత్వ ఖజానాకు వచ్చే పన్ను ఆదాయంలో ఎందుకు కనిపించడం లేదన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.మార్కెట్‌లో కనిపిస్తున్న సందడి, ప్రభుత్వ ఖాతాలోకి చేరుతున్న నికర పన్ను రాబడి మధ్య ఇంత పెద్ద అంతరం ఎందుకు ఏర్పడిందనే దానిపై పలు కారణాలు తెరపైకి వస్తున్నాయి. వ్యాపారం జరిగినంత మాత్రాన ఆ మొత్తం వెంటనే నికర పన్ను ఆదాయంగా ప్రభుత్వానికి చేరదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గతంలో పెండింగ్‌లో ఉన్న భారీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) క్లెయిమ్‌లను వ్యాపారులు ఇప్పుడు వినియోగించుకోవడం వల్ల ప్రస్తుత త్రైమాసికంలో చెల్లించాల్సిన నగదు పన్ను గణనీయంగా తగ్గినట్లు వివరణ ఇస్తున్నారు.
Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ ఖజానా కి షాక్ తగిలిందా ?
Andhra Pradesh ఐజీఎస్టీ సెటిల్‌మెంట్ల జాప్యమూ ప్రధాన కారణమే?
ఏపీ ఎస్‌జీఎస్టీ వసూళ్లపై ప్రభావం చూపిన మరో కీలక అంశంగా ఐజీఎస్టీ సెటిల్‌మెంట్లలో జాప్యం ప్రస్తావనకు వస్తోంది. ఆంధ్రప్రదేశ్ వినియోగ ఆధారిత రాష్ట్రం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో సరుకులు రాష్ట్రంలోకి వస్తుంటాయి. ఈ అంతర్రాష్ట్ర లావాదేవీలపై కేంద్రం వసూలు చేసే ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST)లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను కేంద్రం క్రమం తప్పకుండా సెటిల్ చేయాల్సి ఉంటుంది.అయితే 2025-26 తొలి త్రైమాసికంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కొన్ని ఐజీఎస్టీ సెటిల్‌మెంట్లు సమయానికి కాగ్ లెక్కల్లో సర్దుబాటు కాకపోవడం కూడా రాష్ట్ర సొంత ఎస్‌జీఎస్టీ రాబడి తక్కువగా కనిపించడానికి కారణమైందని చెబుతున్నారు. అంటే రాష్ట్రంలో వస్తువుల వినియోగం పెరిగినప్పటికీ, కేంద్రం నుంచి రావాల్సిన సెటిల్‌మెంట్‌లో జాప్యం జరిగితే ఆ ప్రభావం రాష్ట్ర ఖాతాల్లో పన్ను వసూళ్ల పతనంగా కనిపించే అవకాశం ఉంది.
పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఏపీ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో ఇదే తొలి త్రైమాసికంలో ఎస్‌జీఎస్టీ వృద్ధి ప్లస్ 16 శాతంగా నమోదైంది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా రెండంకెల స్థాయిలో పన్ను రాబడిని పెంచుకున్నాయి. మరోవైపు తమిళనాడు, రాజస్థాన్, ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా మైనస్ గ్రోత్ నమోదు చేసిన రాష్ట్రాల జాబితాలో కనిపిస్తోంది.ఒకే దేశంలో ఒకే రకమైన జీఎస్టీ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్రాల మధ్య ఈ భారీ వ్యత్యాసం ఎందుకు వచ్చిందన్నది కీలకంగా మారింది. ఇతర రాష్ట్రాలు తమ తయారీ, సేవా రంగాల నుంచి నగదు రూపంలో పన్ను రాబడిని పెంచుకుంటున్న సమయంలో.. ఏపీలో పన్ను వసూళ్ల వ్యవస్థ, రిటర్నుల పరిశీలన, పన్ను లీకేజీల నియంత్రణ వంటి అంశాలపై మరింత దృష్టి అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మార్కెట్‌లో వ్యాపారం.. ఖజానాకు మాత్రం ఆదాయం ఎందుకు తగ్గింది?
క్షేత్రస్థాయిలో వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ వాటిలో కొంత భాగం పూర్తిస్థాయిలో పన్ను నెట్‌వర్క్‌లోకి రావడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రిటైల్ మార్కెట్‌లో బిల్లులు లేకుండా జరిగే అమ్మకాలు, ఇతర రాష్ట్రాల నుంచి పన్ను ఎగవేసి వచ్చే అక్రమ సరుకు రవాణాను అడ్డుకోవడంలో వాణిజ్య పన్నుల శాఖ మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెక్‌పోస్టులు లేకపోవడం వంటి అంశాలు కూడా పన్ను ఎగవేతల నియంత్రణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు, పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంటున్నప్పటికీ వాటి వల్ల వెంటనే పన్ను ఆదాయం పెరగడం సాధ్యం కాదన్నది కూడా గమనించాల్సిన అంశమే. కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు పూర్తిస్థాయి ఉత్పత్తి దశకు చేరుకుని పన్నులు చెల్లించే స్థాయికి రావడానికి కొంత సమయం పడుతుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న వ్యాపార కార్యకలాపాల నుంచి రావాల్సిన పన్ను ఆదాయం కూడా తగ్గిపోవడం మాత్రం యంత్రాంగం పనితీరుపై ఆందోళన కలిగించే అంశంగా మారింది.
ఈ మైనస్ 7 శాతం ఎస్‌జీఎస్టీ వృద్ధి రాబోయే బడ్జెట్ నిర్వహణపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉచిత పథకాలు, సూపర్ సిక్స్ హామీల అమలుకు వేల కోట్ల రూపాయల నిధులు అవసరమైన సమయంలో సొంత పన్నుల రాబడి తగ్గితే ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరగవచ్చు. ఆదాయం తగ్గిన కొద్దీ అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది.అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ITC క్లెయిమ్‌లపై క్షేత్రస్థాయి ఆడిటింగ్, కేంద్రంతో సమన్వయం చేసి పెండింగ్‌లో ఉన్న IGST సెటిల్‌మెంట్లను త్వరగా రాష్ట్ర ఖాతాలోకి తీసుకురావడం, పన్ను ఎగవేతలపై నిఘాను మరింత పెంచడం, రిటర్నుల పరిశీలనను కట్టుదిట్టం చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాష్ట్ర సొంత ఆదాయంలో మరింత లోటు ఏర్పడి, ఖజానాపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.







