pension : ఇదేం విడ్డూరం.. మగాడికి వితంతు పెన్షన్ ఇస్తున్న ఏపీ ప్రభుత్వం…!
pension : రాజు గారు దున్నపోతు ఈనింది అంటే దూడను దొడ్లో కట్టేయి అన్నట్లుగా ఉంటుంది కొన్ని సార్లు మన పాలకుల పనితీరు. రాజు గారు తెలివి తక్కువ వాడు కాదు. కాని అన్ని విషయాలను ఆయన చూసుకోలేడు. కనుక దున్నపోతు ఈనిన విషయం రాజు వరకు వెళ్లింది అంటే కింద అధికారులు ఎలాంటి దున్నపోతులో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అలాంటి వ్యవహారాలే జరుగుతున్నాయి. అధికారులు కళ్లు మూసుకు పోయి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పాలకులకు ఇబ్బందులు పెడుతున్నాయి. ఇప్పుడు మేము చెప్పబోతున్న విడ్డూర విషయం విన్న తర్వాత ప్రభుత్వ అధికారులపై కోపం కట్టలు తెంచుకోవడం ఖాయం. ప్రభుత్వాలు మారినా కూడా అధికారులు వారే ఉంటారు. కనుక ఈ విషయంలో అధికారులది తప్పు అనాల్సిందే.
pension : 12 ఏళ్లుగా వితంతు పెన్షన్..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా డోన్ మండలం ఎద్దుపెంట గ్రామానికి చెందిన ఖాశీం అనే వ్యక్తి 12 ఏళ్లుగా పెన్షన్ తీసుకుంటున్నారు. పెన్షన్ తీసుకుంటే విడ్డూరం వింత ఏమీ లేదు. కాని ఒక మగాడు ఆడవారికి ఇచ్చే వితంతు పెన్షన్ ను ఎత్తుకోవడం విడ్డూరం. 12 ఏళ్లుగా వితంతు పెన్షన్ ను ఖాశీం తీసుకోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఈ 12 ఏళ్లలో పెన్షన్ ఎంత నుండి ఎంతుకు పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ లెక్కన అతడు అక్రమంగా తీసుకున్న పెన్షన్ ను లెక్కిస్తే నోరు వెళ్లబెట్టేంత అనడంలో సందేహం లేదు. ఇన్నాళ్లకు అయినా అతడి గుట్టు బయట పడింది జిల్లా మారడం వల్ల.
pension : గుంటూరులో వెలుగులోకి వచ్చిన మోసం..
కర్నూలుకు చెందిన ఇతడు ఇటీవల గుంటూరుకు వెళ్లాడు. అక్కడ వినుకొండ మండలం చిట్టాపురంలో వలస వెళ్లి ఉంటున్నాడు. కొత్త పెన్షన్ విధానంలో దేశంలో ఎక్కడ నుండైనా పెన్షన్ తీసుకోవచ్చు. గుంటూరులో పెన్షన్ తీసుకునేందుకు ఖాశీం ప్రయత్నించగా అసలు విషయం బయటకు వచ్చింది. నీకు వితంతు పెన్షన్ ఎలా వస్తుంది అంటూ ప్రశ్నించడంతో ఆయన సమాధానం చెప్పలేక పోయాడు. దాంతో తీగ లాగితే డొంక కదిలినట్లుగా గుంటూరు నుండి కర్నూలు వరకు తీగ లాగేశారు. అతడిపై కేసు నమోదు చేసి అధికారులను విచారిస్తున్నారు.