Business Idea : ప్లాస్టిక్ వేస్ట్ తో ఇటుకలు తయారు చేస్తూ రూ.3.5 కోట్లు సంపాదించిన యువకులు.. ఎలా సాధ్యమైందో తెలుసా?
Business Idea : దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. ఇబ్బడి ముబ్బడిగా ఆకాశహర్మ్యాలు వెలుస్తున్నాయి. చూస్తుండగానే పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాలు పూర్తయి పోతున్నాయి. ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడు స్థలం కొని ఇల్లు కట్టే పరిస్థితి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏమాత్రం లేదు. అయితే భవన నిర్మాణానికి సిమెంటు, స్టీల్, ఇసుక, ఇటుక ఇవి ముఖ్యమైనవి. ప్రస్తుతమున్న రోజుల్లో వీటన్నింటికి ప్రత్యామ్నాయాలు వచ్చాయి. సాధారణ ఎర్ర మట్టి ఇటుకలకు బదులు సిమెంటు ఇటుకలను వాడటం చాలా రోజుల నుంచే వస్తోంది. ఇప్పుడు ఇది కూడా పోయి.. కొత్త కొత్త టెక్నాలజీ ఆధారిత బ్రిక్స్ వచ్చాయి. ఎన్ని వచ్చినా.. సాంప్రదాయ ఇటుకలకే చాలా మంది ప్రాధాన్యతిస్తారు.
దీనినే దృష్టిలో పెట్టుకున్న అస్సాంకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు పర్యావరణ అనుకూలమైన ఇటుకలను తయారు చేశారు. అది కూడా వ్యర్థ ప్లాస్టిక్‌ను ఉపయోగించి.. చాలా తేలికగా ఉన్న బ్రిక్స్ ను తయారు చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.సాధారణ ఇటుకల తయారీతో ఎదురయ్యే పలు సమస్యలూ నివారించాలన్న ఉద్దేశంతో కొత్త రకం ఇటుకల తయారీకి పూనుకున్నారు ఈ పారిశ్రామిక వేత్తలు. ప్రజలకు ప్రమాదకరం కాకుండా, ఇటుక బట్టీల ఉద్గారాలు మొక్కల జీవితానికి హాని కలగకుండా ఉండేలా కొత్త ఆవిష్కరణకు నాంది పలికారు అస్సాం ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన డేవిడ్ గొగోయ్, మౌసుమ్ తాలుక్దార్ మరియు రూపమ్ చౌదరి అనే ముగ్గురు స్నేహితులు. 2018లో తమ వెంచర్ జెరుండ్తో ఈ ముగ్గురు స్నేహితులు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.
అస్సాం ఇంజినీరింగ్ కళాశాల హాళ్లలో, చివరి సంవత్సరం ప్రాజెక్ట్ మధ్య చర్చగా ప్రారంభమైంది. అస్సాంలోని ఇటుక పరిశ్రమను, దాని వల్ల వచ్చే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో తీవ్రంగా ఆలోచించి, శ్రమించి కొత్త రకం ఇటుకలను తయారు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు మిత్రుల వెంచర్ దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్టప్‌గా ఎదిగింది.జెరుండ్ తయారు చేసిన ఇటుకలు సాధారణ ఇటుకల కంటే బలంగా ఉండటమే కాకుండా ఎక్కువ బరువును తట్టుకుంటాయి. సాధారణ ఇటుకల కంటే చాలా తేలికగా ఉంటాయి. అలాగే ఎర్రమట్టి ఇటుకల వల్ల సంవత్సరానికి 42.64 MT కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను పర్యావరణంలోకి విడుదల చేస్తాయి. జెరుండ్ తయారు చేసిన ఈ రీసైకిల్డ్ ఇటుకల నుంచి ఎలాంటి కాలుష్యం విడుదల కాదు.