Business ldea : ఉద్యోగం రాలేదని చాయ్ బండి స్టార్ట్ చేసి లక్షలు సంపాదిస్తున్న ఇంజినీర్.. ఎక్కడో తెలుసా?
Business ldea : మనం ఒకటి తలిస్తే పైనున్న వాడు మరొకటి తలుస్తాడు అనే నానుడి ఊరికే పుట్టలేదు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. ట్విస్టులు ఇవ్వడం డైరెక్టర్ పూరి జగన్నాథ్ కంటే కూడా దానికే బాగా తెలుసు. మహారాష్ట్రకు చెందిన గణేష్ దుధ్నాలే.. గుజరాత్ వాపిలోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత అందరు విద్యార్థుల్లాగే జాబ్స్ కోసం ఎంతో ప్రయత్నించాడు. కానీ ఏ ఉద్యోగం కూడా రాలేదు. పలు ఆఫర్లు వచ్చినా… అవి చాలా తక్కువ జీతం మాత్రమే ఇస్తామనడంతో జాబ్ చేయాలన్న తన కల నెరవేరబోదని బాధపడ్డాడు. తన మనసులో ఉన్న ఓ ఆలోచనను తన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నాడు. ఒక వేళ జాబ్ రాకపోతే ఏం చేయాలన్న దానికి టీ వ్యాపారాన్ని బ్యాకప్ ప్లాన్ గా ఉంచుకున్నాడు గణేష్.
భారత దేశంలో టీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తనకు బాగా తెలుసు. అలాగే తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందవచ్చని భావించాడు. తన ఐడియాను కుటుంబానికి చెప్పినా.. వారికి ఆ ఆలోచన ఏమాత్రం నచ్చలేదు. అతి కష్టం మీద వారిని ఒప్పించగలిగాడు. తన తండ్రి నుండి రూ. 6 లక్షలు అందుకున్న గణేష్.. వాపి ప్రాంతంలోని రైల్వే స్టేషన్ వద్ద చాయ్ మేకర్ బ్రాండ్ పేరుతో కియోస్క్ ను ప్రారంభించాడు. యాలకులు, అల్లం లాంటి సాంప్రదాయమైన టీ కాకుండా వెరైటీగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. మామిడి, స్ట్రాబెర్రీ, గులాబీ, అరటి, హాట్ చాక్లెట్ మరియు ఇతర పండ్ల రుచులతో సహా ఎనిమిది రకాల టీలను రూపొందించాడు. 2020లో సూరత్ లో రెండో ఔట్ లెట్ ప్రారంభించారు.

engineer fails to get job starts tea business earns lakhs chai maker ganesh
క్రమంగా రుచులను పెంచాడు గణేష్. బటర్ స్కాచ్, వెనిల్లా లాంటి ఐస్ క్రీం ఫ్లేవర్లను అందించాడు. ఛాయ్ మేకర్స్ లో 20 రకాల టీలు మరియు 15 రకాల కాఫీలు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు షేక్స్ మరియు స్నాక్స్ వంటి శీతల పానీయాలను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం గణేష్ కు 7 ఔట్ లెట్ లు ఉన్నాయి. ఒక్కో ఔట్ లెట్ నుండి రూ. 8 వేలకు పైగా సంపాదిస్తున్నాడు. నెలకు రూ. 3 లక్షల వరకు ఆదాయం వస్తోంది. రోజూ ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నాడు గణేష్. గుజరాత్ లో 100 అవుట్ లెట్ లు, దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా అవుట్ లెట్ లు ఉండాలని అతను కలలు కంటున్నాడు.