Donkey Business : గాడిదలు కాస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు.. ఎలా సాధ్యమైందో తెలుసా?
Donkey Business : అరేయ్ గాడిద.. నీకేం పనీపాటా లేదా అంటూ ఎవరైనా సోమరిపోతు ఉంటే వాళ్లకు గాడిదతో పోల్చుతుంటాం. ఎందుకంటే మన దృష్టిలో గాడిద దేనికీ పనికిరాదు అని అర్థం. కానీ.. గాడిద వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. గాడిద ఎన్ని పనులు చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. తాజాగా ఆ గాడిదలనే ఆదాయ మార్గంగా మార్చుకొని నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు ఓ యువకుడు.
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు గాడిద పాలతో లక్షలు సంపాదిస్తున్నాడు. జిల్లాలోని బిజినేపల్లి మండలం బెలిగొండకు చెందిన పులిదండ నగేష్ గురించే మనం మాట్లాడుకునేది. నగేష్ జీవనం కోసం చాలా పనులు చేశాడు కానీ.. ఏదీ కలిసిరాలేదు. దీంతో ఏం చేయాలి అంటూ చాలా రోజులు ఆలోచించి చివరకు గాడిద పెంపకం వైపు మొగ్గు చూపాడు. గాడిద పాలకు బాగా డిమాండ్ పెరుగుతోందని తెలుసుకున్న నగేష్ దాన్నే వ్యాపారంగా మార్చుకున్నాడు.
Donkey Business : కోటిన్నర పెట్టుబడితో 110 గాడిదలను కొన్న నగేష్
దాదాపు కోటిన్నర పెట్టుబడి పెట్టి నగేష్.. 110 గాడిదలను కొన్నాడు. వాటిని ఓ షెడ్ లో ఉంచి ఇప్పుడు వాటి నుంచి పాలను తీసి అమ్ముతున్నారు. నగేష్, అతడి కొడుకు ఇద్దరూ కలిసి ఈ బిజినెస్ ను ప్రారంభించారు. ఈ పాల ద్వారా నెలకు వాళ్లకు 6 లక్షల ఆదాయం వస్తోంది. ఇప్పటి వరకు గాడిదలతో పాల బిజినెస్ చేసేవాళ్లు ఎవరూ లేరు. తెలంగాణలో అయితే ఇదే తొలి ఫామ్. అయితే.. ఇదేమీ అంత సులువైన వ్యాపారం కాదు.
గాడిదలకు రోజూ ఆహారం ఇవ్వడం అనేది సవాల్ తో కూడుకున్నదే. అది కూడా 110 గాడిదలకు రోజూ ఆహారం పెట్టడం అనేది చాలా కష్టమైన పని. ఆరు ఎకరాల స్థలంలో గాడిదల కోసం ప్రత్యేకమైన షెడ్ వేసి.. వాటి ఆహారం కోసం మరో 10 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని అందులో గడ్డి పెంచుతున్నారు. తమిళనాడుకు చెందిన ఓ సంస్థ ఈ గాడిద పాలను కొనుగోలు చేస్తుంది.