Business idea : ఓవైపు జాబ్ చేస్తూనే బిర్యానీ సెంటర్ పెట్టి లక్షలు సంపాదిస్తున్న ఇంజనీర్లు.. ఎక్కడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business idea : ఓవైపు జాబ్ చేస్తూనే బిర్యానీ సెంటర్ పెట్టి లక్షలు సంపాదిస్తున్న ఇంజనీర్లు.. ఎక్కడో తెలుసా?

 Authored By jyothi | The Telugu News | Updated on :8 February 2022,4:20 pm

Business idea : ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరిపై కరోనా ప్రభావం ఎంతో కొంత పడింది. అనేక రంగాలు తీవ్ర నష్టాలను చవి చూశాయి. కొన్ని సంస్థలు మూతపడ్డాయి. కొందరు మాత్రం కరోనా సంక్షోభంలోనూ మంచి లాభాలు గడించారు. మరికొందరు ఈ కాలాన్ని తమ అభివృద్ధికి వాడుకున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరికి చెందిన ఇద్దరు ఇంజినీర్లను కరోనా కాలం వ్యాపారవేత్తలుగా మార్చింది. వృత్తిరీత్యా ఇంజనీర్లు అయిన సుమిత్ సమల్ మరియు ప్రియమ్ బెబర్తా చిన్నప్పటి నుండి స్నేహితులు. కరోనా మహమ్మారి లాక్‌డౌన్‌ తో సొంతూరికి వచ్చి వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నారు. అయితే ఒక రోజు బిర్యానీ తినేందుకు బయటకు వెళ్లారు. స్థానికంగా ఉండే బండి వద్ద బిర్యానీ తినాలని అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్న అపరిశుభ్ర పరిసరాలను చూసి వారికి ఒక రకమైన ఏవగింపు కలిగింది. చాలా మంది స్ట్రీట్‌ ఫుడ్‌ ను ఇష్టపడతారు. కొంత మంది స్థోమత లేక స్ట్రీట్‌ ఫుడ్‌ను ఆశ్రయిస్తే..

కొందరు అక్కడ ఉండే టేస్ట్ కోసం వస్తుంటారు. కానీ తోపుడు బండి వద్దకు వచ్చే వారందరూ చేసే ఒకే ఒక కంప్లైంట్‌ పరిశుభ్రత. దాదాపు ఏ స్ట్రీట్‌ ఫుడ్‌ బండి దగ్గరికి వెళ్లినా.. పరిసరాలు ఏమాత్రం శుభ్రంగా ఉండవు. అక్కడ వడ్డించే వంటకాలు అంత నాణ్యతగా కనిపించవు. అయితే ఇవి ఎంతవరకు నాణ్యమైనవి అనే ప్రశ్న సుమిత్‌ సమల్‌, ప్రియమ్‌ బెబర్తాకు వచ్చింది. అక్కడి పరిస్థితి చూసిన ఆ ఇద్దరు స్నేహితులకు ఒక బిజినెస్‌ ఐడియా తట్టింది. తామే ఒక స్ట్రీట్ ఫుడ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని బలంగా అనుకున్నారు. శుభ్రమైన, తాజా ఆహారాన్నే అందించాలని నిర్ణయించుకున్నారు. రుచి తో పాటు శుచి కూడా ఉండాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇంజినీర్స్‌ థేలా పేరుతో మల్కన్‌గిరి కలెక్టర్‌ కార్యాలయం సమీపంలో ఫుడ్ కార్ట్‌ను ప్రారంభించారు.

order biryani online street food stall engineers thela business idea

order biryani online street food stall engineers thela business idea

మార్చి 2021లో పెట్టిన ఫుడ్‌ కార్ట్‌ క్రమంగా ఆహార ప్రియులను ఆకర్షించడం మొదలు పెట్టింది. రుచితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అందరికీ నచ్చడం మొదలైంది. ఇంజినీర్స్‌ థేలా వద్దకు తినడానికి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. రుచికరమైన బిర్యానీ తో పాటు చికెన్‌ టిక్కాస్‌ సహా పలు ఆహార పదార్థాలను మెనుగా అందిస్తోంది ఇంజినీర్స్ థేలా. ఈ ఇంజనీర్స్ థేలా అనే చిన్న వెంచర్.. ఇప్పుడు చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఫుడ్ కార్ట్‌ ల వద్ద శుభ్రత ఉండదని భావించే వారి భావనను పటాపంచలు చేస్తూ కొత్త సంస్కృతికి నాంది పలికారు ఈ కార్పొరేట్ ఉద్యోగులు సుమిత్ సమల్ మరియు ప్రియమ్ బెబర్తా. భవిష్యత్తులో మరిన్ని ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసే ప్రణాళికలో ఉన్నారు ఇద్దరు మిత్రులు.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది