Vaisakha masam : వైశాఖంలో ఛత్రదానం చేస్తే కలిగే ఫలం ఇదే !

0
Advertisement

Vaisakha masam  వైశాఖం మంచి ఎండలుతో ఉండే మాసం. ఈ మాసంలో ఛత్రం అంటే గొడుగు దానం చేస్తే కలిగే ఫలితం గురించి తెలిపే వైశాఖమాస వ్రతమహత్యంలో కథ తెలుసుకుందాం…

వైశాఖమాసమున Vaisakha masam 2021 యెండకు బాధపడు సామాన్యులకు, మహాత్ములకు యెండ వలని బాధ కలుగకుండుటకై గొడుగుల నిచ్చిన వారి పుణ్యమనంతము. దానిని వివరించు కథను వినుము.

పురాణగాథ…

పూర్వం కృతయుగమున జరిగిన వైశాఖమాస వ్రతమును వివరించు కథ యిది వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు కలడు. ఒకసారి ఆయన వేటకు వెళ్తాడు. అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కిటిని వేటాడి అలసి యచటనున్న మునుల యాశ్రమమునకు బోయెను. ఆ ఆశ్రమము శతర్చినులను మునులయాశ్రమము. ఆ విషయము నెరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగ పలుకరించినను వారు సమాధానమీయక పోవుటచే వారిని చంపపోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడా మునుల శిష్యులు చాలామంది వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధీ! మా గురువులు తపోదీక్షలోనున్నారు. వారికి బాహ్యస్మృతి లేదు. కావున వారు నిన్ను చూడలేదు. గౌరవింపలేదు. ఇట్టివారిపై కోపము కూడదని వారు పలికిరి.

అప్పుడు కుశకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని జూచి మీ గురువులు తపోదీక్షలో నున్నచో మీరు అలసిన నాకు ఆతిధ్యమునిండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు రాజకుమారా! మేము భిక్షాన్నమును తినువారము మీకు ఆతిధ్యమిచ్చుటకు మా గురువుల యాజ్ఞలేదు. ఇట్టిమేము నీకాతిధ్యము ఇవ్వలేం అని చెప్పిరి. హేమకాంతుడు ప్రభువులమగు మేము క్రూరజంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్ము రక్షించు ప్రభువులం. మేమిచ్చిన అగ్రహారములు మున్నగువానిని తీసుకుని మీరు మాయెడల నీ విధముగ నుండరాదు. కృతఘ్నులైన మిమ్ము చంపినను తప్పులేదు. అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టిరి. ఆశ్రమమును పాడు చేసిరి.

Vaisakha masam 2021
Vaisakha masam 2021

పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను. నీవు రాజుగనుండదగవని వానిని దేశము నుండి వెడలగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశబహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధముగ నిరువదియెనిమిది సంవత్సరములు గడచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాతధర్మముల నాచరించుచు కిరాతుడై జీవించుచుండెను. బ్రహ్మ హత్యా దోషమున నిలకడలేక అడవుల బుట్టి తిరుగుచు జీవించుచుండెను. వైశాఖమాసమున త్రితుడను ముని ఆ యడవిలో ప్రయాణించుచుండెను. ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు నొకచోట మూర్ఛిల్లెను. దైవికముగ ఆ యడవిలోనే యున్న హేమకాంతుడు వానిని జూచి జాలిపడెను. మోదుగ ఆకులనుదెచ్చి ఎండపడకుండ గొడుగుగ చేసెను. తన యొద్ద సొరకాయ బుఱ్ఱలోనున్న నీటిని జల్లి వానిని సేద తీర్చెను. త్రితుడును వాని చేసిన యుపకారములచే సేదదీరి సొరకాయబుఱ్ఱలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగ నుండెను. హేమాంగదుడు వ్రతము నాచరింపక పోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని యిచ్చుటచే వానికి గల పాపములన్నియు పోయెను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంత కాలమునకతడు రోగగ్రస్తుడై యుండెను. పైకి లేచియున్న జుట్టుతో భయంకరాకారులగు యమదూతలు వాని ప్రాణములగొనిపోవచ్చిరి. హేమకాంతుడును వారిని జూచి భయపడెను. వైశాఖమున మోదుగాకుల గొడుగును, సొరకాయ బుఱ్ఱనీటిని యిచ్చిన పుణ్యబలమున వానికి శ్రీమహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను.

దయాశాలియగు శ్రీమహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము. వైశాఖమాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపుము. హేమాంగదుడు వైశాఖధర్మము నాచరించి నాకిష్టమైన వాడయ్యెను. పాపహీనుడయ్యెను. ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మము నాచరించి ఒక మునిని కాపాడినవాడు. మోదుగాకుల గొడుగును నీటిని యిచ్చినవాడు. ఆ దాన ప్రభావమున నితడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి. శౌర్యాదిగుణ సంపన్నుడు. నీకు సాటియైనవాడు. కావున వీనిని రాజుగ చేయుమని నామాటగ చెప్పుమని శ్రీమహావిష్ణువు విష్వక్సేనుని హేమాంగదుని వద్దకు పంపిస్తాడు.
భగవంతుని యాజ్ఞ ప్రకారము విష్వక్సేనుడు హేమాంగదుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను. హేమాంగదుని తండ్రియగు కుశకేతువు వద్దకు గొనిపోయి శ్రీమహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుని అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడ సంతోషముతో తన పుత్రుని స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యము నిచ్చి విష్వక్సేనుని యనుమతితో భార్యతో బాటు వనముల కేగి తపమాచరింపబోయెను. విష్వక్సేనుడును కుశకేతువును హేమాంగదుని ఆశీర్వదించి విష్ణుసాన్నిధ్యమున కెరిగెను.

హేమకాంతుడును మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖమాసమున Vaisakha masam 2021 వైశాఖవ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యెను. హేమాంగదుడు బ్రహ్మజ్ఞానియై ధర్మమార్గము నవలంభించి, శాంతుడు, దాంతుడు, జితేంద్రియుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వసంపదలను పొంది, పుత్ర పౌత్రులతో కూడినవాడి సర్వభోగముల ననుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. శ్రుతకీర్తి మహారాజా! వైశాఖ ధర్మములు సాటిలేనివి. సులభసాధ్యములు పుణ్య ప్రదములు. పాపమును దహించునని ధర్మార్థకామమోక్షములను కలిగించునవి. ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యఫలమునిచ్చునని శ్రుతదేవుడు వివరించెను, అని నారదుడు అంబరీషునకు చెప్పెను. ఇలా పాపములు చేసిన వారి పాపాలను కడిగివేసి వారికి అనంత పుణ్యఫలాలను ఇచ్చే ఛత్రదానం చాలా గొప్పది. మీరుకూడా అవసరార్థులకు గొడుగులను దానం చేయండి. వారిలోని శ్రీమహావిష్ణువును దర్శించి నమస్కరించండి.

Advertisement