Vinayaka Chaturthi Festival : ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 18న జరపాలా లేక సెప్టెంబర్ 19న చేసుకోవాలా అనే సందిగ్ధత అందరిలో నెలకొంది. గడిచిన ఏడాది కాలంగా పండుగల విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంటుంది. పండుగలకు సంబంధించిన తిథులు ఒకరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం మొదలై మరుసటి రోజు మధ్యాహ్నం కి ముగుస్తుండడం దీనికి కారణమని పండితులు చెబుతున్నారు. రాఖీ పండుగ విషయంలో కూడా ఇలాంటి సందిగ్ధత రావడంతో ఆగస్టు 30 బుధవారం సాయంత్రం తర్వాత లేదా గురువారం వేకువ జామున పండుగ నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. వినాయక చవితి పండుగపై కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ ప్రజల్లో నెలకొంది. అయితే సెప్టెంబర్ 18న వినాయక చవితి నిర్వహించాలని తెలంగాణ విద్వత్సభ సూచించింది.
సెప్టెంబర్ 18 నుంచి నవరాత్రులను ప్రారంభించాలని ప్రజలకు తెలిపింది. వర్గల్ లోని విద్యా సరస్వతి క్షేత్రంలో వందమంది పండితుల సమక్షంలో వార్షిక విద్వత్సమ్మెళనంలో చర్చించి ఈ పండుగపై ఒక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు భాగ్యనగరం తో పాటు చుట్టూ పక్కనే ఉన్న ప్రాంతాలలో వినాయక చవితి ఏర్పాట్లు, మండపాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్ సహా చుట్టుపక్కల 32వేల మండపాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అందుకే పకడ్బందీగా ఏర్పాటు చేస్తామని అన్నారు.

వినాయక చవితి ప్రారంభం అయినప్పటి నుంచి నిమజ్జనం వరకు బందోబస్తు ఉంటుందని తెలిపారు. అవసరమైతే పక్క రాష్ట్రాల పోలీసుల సాయం తీసుకుంటామని తెలిపారు. అయితే చవితికి ఇంకా సమయం ఉండడంతో అధికారికంగా పండుగ ఎప్పుడు చేసుకోవాలన్నది ప్రభుత్వం త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. అయితే 18వ తేదీ మధ్యాహ్నం చవితి తిధి మొదలై 19 మధ్యాహ్నం ముగుస్తుంది. సాధారణంగా సూర్యోదయం తర్వాత వచ్చిన తిధిని పండుగగా గుర్తిస్తాం. అందువల్ల 19న వినాయక చవితి జరుపుకుందామని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది.