Vasantha panchami : వసంత పంచమి నాడే అక్షరాభ్యాసం ఎందుకు చేయించాలి?
Vasantha panchami : వసంత పంచమి రోజే సరస్వతీ దేవి జయంతి. అక్షరానికి అధి దేవతగా సరస్వతీ దేవిని చెప్తారు. సరస్వతీ శబ్దానికి ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం అని అర్థం. అంటే దేవిని స్తుతించడం వల్ల అపారమైన జ్ఞానం కల్గుతుందట. ఎన్నో కావ్యాల్లో సరస్వతీ దేవిని సకల కళామయిగా చెప్పారు. మార్కండేయ, స్కంద పురాణాల్లో.. ధర్మ సింధు శ్రీవాణి స్తుతిని రనరమ్యంగా స్తుతించాయి. అలాగే వేదాలు సరస్వతీ మాత నుంచే వెలువడ్డాయని గాయత్రీ హృదయం అనే గ్రంథం చెబుతోంది. సరస్వతీ దేవి జ్ఞాన దేవతగా విరాజిల్లుతోంది. మనం ఏ పాఠశాలలో చూసిన విద్యనందించే సరస్వతీ దేవి విగ్రహాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. మనకు చదువు అనగానే గుర్తొచ్చేది తెలుపు రంగు వస్త్రాల్లో పద్మంపై ఆసనమ్మైన ఆ అమ్మవారే మదిలో మెదులుతుంది.
ఓ చేతిలో పుస్తకం, మరో చేతిలో జపమాల, వీణ, అభయ ముద్రలతో కనిపిస్తుంటుంది. ఇంత ప్రశాంతంగా కనిపిస్తూనే… వ్యాసుడు, ఆది శేషువు, బృహస్తపి, ఆది శంకరులు, యాజ్ఞవల్క్యుడుకి జ్ఞానాన్ని అందించింది. వాగ్దేవి ఉపాసన వల్లే వాల్మీకి రామాయణాన్ని రచించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే సకల జనులకు కూడా అమ్మవారే జ్ఞానాన్ని అందిస్తారు. అందుకే విద్య, జ్ఞానం కోసం అమ్మవారికి పూజలు చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. చిన్న పిల్లలు బడికి వెళ్లే కంటే ముందుగానే అంటే మొదటి సారి అజ్ఞరాభ్యాసంతోనే అక్షరాలు దిద్దిస్తారు. ఇలా చేయడం వల్ల సరస్వతీ దేవి కృప తమపై ఎక్కువగా ఉంటుందని.. చదువు తొందరగా వస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ముఖ్యంగా అమ్మవారి జయంతి అయిన వసంతి పంచమి నాడు అక్షరాభ్యాసం చేయిస్తే మరింత మంచిదంటారు.
అందుకే వసంత పంచమి నాడు ప్రముఖ పుణ్య క్షేత్రమైన బాసరకు వెళ్లి అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. వీలు కాని వారు పాఠశాలల్లో లేదా గుడుల్లో ఈ కార్యాక్రమాలను చేయించుకుంటారు. అలాగే వసంతి పంచమి నాడు అమ్మవారిని తెల్లని పూలతో పూజించడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పూజ అనంతరం అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నం, నారికేళము,అరటి పండ్లు, చెరుకు గడలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి ఈ వంటకాలు అంటే చాలా ఇష్టమట. మరి సరస్వతీ దేవికి ఇష్టమైన తెల్లని పూలు, ఇష్టమైన ప్రసాదాలతో అమ్మకు పూజ చేస్తే మీరు కోరుకున్న కోరికలతో పాటు… అపారమైన జ్ఞానం మీకు మీ పిల్లలకు సొంతమవుతుంది.