AR Rahman : తినడానికి చిల్లి గవ్వ లేని రోజుల నుంచి ప్రపంచం మెచ్చే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన ఏఆర్ రెహమాన్
AR Rahman : ఏఆర్ రహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రపంచ సంగీతానికి ఎన్నో సేవలు అందించారు. కోట్లాది మందిని ఆయన సంగీతం పులకరింపజేస్తుంది. భారతీయ సంగీతానికి ప్రపంచ గుర్తింపు తెచ్చిన రెహమాన్ జీవితం పూల దారి ఏం కాదు. అది ముళ్లబాటే. ఆయన సక్సెస్ స్టోరీ కోట్లాది మందికి స్ఫూర్తి. అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డును కూడా సాధించిన ఘనత ఏఆర్ రహమాన్ కు దక్కుతుంది. మరి.. ఏఆర్ రహమాన్ జీవితంలో జరిగిన ఎన్నో చేదు ఘటనలు, ఆయన సక్సెస్ స్టోరీ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏఆర్ రహమాన్ అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్. జనవరి 6, 1967 లో రహమాన్ పుట్టాడు. ఆయన తండ్రి ఆర్కే శేఖర్ కూడా మంచి పేరున్న మ్యూజిక్ కంపోజర్. తమిళం, మలయాళం సినిమాలకు పనిచేశారు.
తండ్రి వెంట దిలీప్ మ్యూజిక్ స్టూడియోలకు వెళ్లేవాడు. నాలుగేళ్ల వయసులోనే తండ్రి ప్రభావంతో అతడికి సంగీతంపై ఆసక్తి పెరిగింది. దీంతో నాలుగేళ్ల వయసులోనే దిలీప్ కు తన తండ్రి గిటార్ కొనిపెట్టారు. స్కూల్ కు వెళ్తూనే సంగీత పాఠాలు మొదలు పెట్టాడు దిలీప్. తనకు 9 ఏళ్ల వయసు రాగానే దిలీప్ తండ్రి చనిపోయాడు. అప్పుడే వాళ్లకు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. చెన్నైలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని తండ్రికి ఉన్న వస్తువులను అద్దెకు ఇస్తూ వచ్చిన డబ్బులతో కాలం వెళ్లదీసేవాడు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడం, తన అక్కకు జబ్బు చేయడంతో ఆమె ట్రీట్ మెంట్ కు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు దిలీప్. తన అక్కకు జబ్బు నయం అయితే ఇస్లాం మతం స్వీకరిస్తానని ఒక దర్గా దగ్గర మొక్కుకున్నాడు దిలీప్ కుమార్. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో దేవుడే తనకు దిక్కు అనుకున్నాడు దిలీప్.
ఆ మొక్కులు ఫలించి చావు నుంచి తన అక్క బయటపడటంతో దిలీప్ కాస్త అల్లా రక్కా రహమాన్ అయ్యాడు. తన తల్లి కస్తూరి, కరీమాగా మారిపోయింది. ఏ పని మొదలు పెట్టినా అల్లాను తలుచుకునే చేసేవాడు. ఏ పని చేసినా సక్సెస్ అయ్యేవాడు. స్కూల్ మానేసి జాకిర్ హుస్సేన్ లాంటి హేమాహేమీల గ్రూపులో ప్లేస్ సంపాదించాడు రహమాన్. వాళ్లతో దేశమంతా తిరిగే వాడు. ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్లేవాడు. దీంతో వాళ్లు ఇచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోయేది కాదు. దీంతో సంగీతంపై మరింత పట్టు సాధించేందుకు సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా జాయిన్ అయ్యాడు. ఇలయరాజా, రమేశ్ నాయుడు, రాజ్ కోటీ లాంటి వాళ్ల దగ్గర పని చేసి సంగీతంలో పట్టు సాధించాడు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు స్టూడియోలోనే పడుకొని అక్కడే ఏదో ఒకటి తిని కాలం వెళ్లదీసేవాడు రహమాన్. ఒక కాఫీ యాడ్ కు రెహమాన్ చేసిన మ్యూజిక్ పాపులర్ అయింది. దానిని తీసుకొని మణిరత్నం దగ్గర చాన్స్ కొట్టేయాలని ఆయన చుట్టూ తిరిగాడు.
తను కంపోజ్ చేసిన వాటిని చూపించి ఒప్పించాడు. 20 సార్లు తిరిగితే కానీ రెహమాన్ లో కసి మణిరత్నానికి అర్థం కాలేదు. ఈ కుర్రాడిలో కసి ఉందని గ్రహించిన మణిరత్నం రోజా సినిమాలో చాన్స్ ఇచ్చాడు. ఒకే ఒక్క సినిమాతో రహమాన్ పేరు మారుమోగిపోయింది. రోజా సినిమా తర్వాత రంగీలా సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఆ తర్వాత లగాన్ లాంటి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో రహమాన్ కు గుర్తింపు వచ్చింది. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాతో గోల్డెన్ గ్లోబ్ తో పాటు ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ప్రతి ఏటా ఏదో ఒక మూవీతో సంగీత ప్రియులను అలరించాడు రహమాన్. ఇక తన ఫ్యామిలీ విషయానికి వస్తే రహమాన్ కు ముగ్గురు పిల్లలు. ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. తన కొడుకు కూడా సంగీతంలో ప్రావీణ్యం సంపాదించాడు. అలా తినడానికి చిల్లిగవ్వ లేని స్థాయి నుంచి ఇప్పుడు ప్రపంచం మెచ్చే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు ఏఆర్ రహమాన్.