Thalapathy 69 : రియల్ పొలిటికల్ ఎంట్రీకి ముందే విజయ్ రీల్ ఎంట్రీ !
Thalapathy 69 : సౌత్ ఇండియన్ సినిమా ప్రముఖ నటుల్లో ఒకరు తలపతి విజయ్. పూర్తి సమయం రాజకీయ జీవితంలోకి మారడానికి ముందు ‘తలపతి 69’ తన చివరి చిత్రం అని ఆయన ఇప్పటికే ప్రకటించారు. దాంతో ఈ ప్రకటన సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. విజయ్ చివరి చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు ఈ విషయాన్ని ధృవీకరించారు. విజయ్ ‘తమిళ్ వెట్రి కళగం’ పేరుతో ఇప్పటికే పార్టీని స్థాపించి జనాల్లోకి తీసుకెళ్తున్నాడు. 2026 తమిళనాడు ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయ కార్యక్షేత్రంలోకి దిగలేదు. మరో రెండు సినిమాల అనంతరం ప్రజా క్షేత్రంలోకి వెళ్తారు.
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో పాద యాత్రతో జనాల్లోకి వెళ్లే ఆలోచనలో ఆయన ఉన్నట్లు మీడియాలో ప్రచారం కొనసాగుతున్నది.అయితే అంతకంటే ముందే విజయ్ రాజకీయ ఆకాంక్షలను తన సినిమా ద్వారా సమాజంలోకి తీసుకెళ్లే ప్రణాళికతో ఉన్నట్లుగా తెలుస్తోంది. 200 శాతం విజయ్ అనుభవాన్ని అందించేలా ‘తలపతి 69’ ఒక అద్భుతమైన చిత్రం అవుతుందని దర్శకుడు హెచ్ వినోద్ అభిమానులకు హామీ ఇచ్చారు. ఈ చిత్రం రాజకీయ నేపథ్యంతో కూడినది కాదని ఆయన స్పష్టం చేశారు.
ఎలాంటి రాజకీయ ప్రముఖులు లేదా పార్టీలను లక్ష్యంగా చేసుకోకుండా అన్ని వయసుల ప్రేక్షకులను అలరించడానికి రూపొందించబడిన వాణిజ్య చిత్రమని వెల్లడించారు.విజయ్ తదుపరి వెంకట్ ప్రభు యొక్క ‘GOAT’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)లో కనిపించనున్నాడు, సెప్టెంబర్ 5న ఈ మూవీ విడుదల కానుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి.