Vaishnav Tej : వైష్ణవ్ తేజ్ ఏంటీ ఈ సెలక్షన్… ఉప్పెన తర్వాత ఇలాంటివి చేయడం ఏంటీ?
Vaishnav Tej : మెగా ఫ్యామిలీకి చెందిన వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా తో హీరోగా పరిచయం అయ్యాడు. మెగా బ్రదర్స్ మేనల్లుడు అవ్వడం వల్ల సినిమా విడుదల అవ్వకుండానే వైష్ణవ్ తేజ్ కు మంచి గుర్తింపు లభించింది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఉప్పెన సినిమా చేసి సక్సెస్ అయ్యి మరింత గా ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. మెగా బ్రదర్స్ మరో మేనల్లుడు అయినా సాయి ధరమ్ తేజ్ కంటే కూడా తమ్ముడు వైష్ణవ్ తేజ్ బాగున్నాడు.. మంచి సినిమాలు చేసే అవకాశం ఉందంటూ ఉప్పెన సక్సెస్ సమయంలో అంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్నట్లుగానే ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వచ్చాడు.
ఆయన సినిమాలు మరియు ఆయన ఎంపిక చేసుకుంటున్న పాత్రలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. ఉప్పెన వంటి కమర్షియల్ హిట్ తర్వాత ఎవరైనా మంచి కమర్షియల్ సినిమాలను చేయాలనుకుంటారు. కానీ కొండ పొలం వంటి విభిన్నమైన సినిమాను చేసేందుకు వైష్ణవ్ తేజ్ ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాలేదు. క్రిష్ కచ్చితంగా మంచి దర్శకుడు.. ఆయన ఒక మంచి సబ్జెక్ట్ తో వచ్చి ఉంటే చేసినా పర్వాలేదు కానీ కొండ పొలం అనే నాన్ కమర్షియల్ సినిమాను చేసేందుకు వైష్ణవ్ తేజ్ ఒప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ సినిమా నటుడిగా పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా ప్లాప్ అయ్యింది.
ఇప్పుడు రంగ రంగ వైభవంగా అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు వైష్ణవ్ తేజ్ సిద్ధం అయ్యాడు. గిరీశయ్య దర్శకుడు. ఈ సినిమా విడుదలకు మరో రెండు వారాల సమయం కూడా లేదు. కానీ ఇప్పటి వరకు సినిమా కు పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అవ్వలేదు. పైగా తాజాగా విడుదల అయిన ట్రైలర్ సినిమా పై ఉన్న ఆసక్తిని కూడా తగ్గించింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా ఈ సినిమా ఉండబోతుందని.. పాత చింతకాయ తొక్కు అన్నట్లుగా ఈ సినిమా కథ పాతది అన్నట్లు టాక్ వినిపిస్తుంది. మొత్తానికి రంగరంగ వైభవంగా సినిమాకు పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు కదా నెగటివ్ వైబ్స్ ఉన్నాయి. ఉప్పెన వంటి వంద కోట్ల సినిమా తర్వాత ఇలాంటి కథలు ఎంపిక చేసుకోవడం ఏంటీ వైష్ణవ్ అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. తదుపరి సినిమా అయినా మంచి సబ్జెక్ట్ తో చేస్తాడేమో చూడాలి.