Tollywood : టాలీవుడ్‌లో సత్తా చాటుతున్న మలయాళీ ముద్దుగుమ్మలు..అదే కారణం..
Tollywood: టాలీవుడ్‌లో సత్తా చాటుతున్న మలయాళీ ముద్దుగుమ్మలు..అదే కారణం. అవును…ఇటీవల వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో మరో మలయాళీ భామ తెలుగు తెరకు పరిచయం కావడంతో ఇప్పుడు కొత్తగా ఈ టాక్ మొదలైందని చెప్పాలి. గతకొంత కాలంగా ముంబై, ఢిల్లీ భామలు, మోడల్స్ కంటే మలయాళ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీకొచ్చి సత్తా చాటుతున్న బ్యూటీస్ ఎక్కువగా ఉన్నారు. గతంలో మన తెలుగు దర్శక, నిర్మాతలు సినిమాకో కొత్త అమ్మాయిని ఇండస్ట్రీకి పరిచయం చేసేవారు. కానీ, గత కొన్నేళ్ళుగా అది తగ్గిందనే చెప్పాలి.మలయాళం నుంచి లేదా తమిళ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారు.
సాయి పల్లవి: తమిళనాడులో పుట్టినప్పటికీ పరిచయం అయింది మాత్రం మలయాళ చిత్రపరిశ్రమ నుంచే. డాక్టర్ చదివిన సాయి పల్లవి పలు డాన్స్ షోస్‌లో పాల్గొని..హీరోయిన్‌గా మారింది. ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో బాగా పాపులర్ కావడంతో తెలుగులో ఫిదా సినిమాలో అవకాశం అందుకొని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సమయంలో సాయి పల్లవి 6 నెలలు ఆగితే గానీ ఫిదా సినిమా చేయలేను అని చెప్పింది. మరో దర్శకుడైతే ఈ 6 నెలల్లో సినిమాను కంప్లీట్ చేసేవాడు. కానీ శేఖర్ కమ్ములకు సాయి పల్లవిలో నేచురల్ పర్ఫార్మర్ కనిపించింది. అందుకే, తను అడిగినట్టు 6 నెలలు వెయిట్ చేసి ఫిదాతో తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఎం సి ఏ, పడి పడి లేచె మనసు, లవ్ స్టోరి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారింది.
కీర్తి సురేశ్: తండ్రి నిర్మాత, తల్లి ఒకప్పట్టి హీరోయిన్. అలా సినిమా ఇండస్ట్రీలో మూలాలున్న కీర్తి సురేశ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేసింది. ఆ తర్వాత మలయాళ, తమిళ సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంది. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై నేను లోకల్, మహానటి, అజ్ఞాతవాసి, లాంటి సినిమాలతో ఇక్కడ బాగా గుర్తింపు తెచ్చుకుంది. వరుస ఫ్లాపులొస్తున్నా కీర్తికి తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. భోళా శంకర్, సర్కారు వారి పాట, దసరా సినిమాలు చేస్తోంది కీర్తి.
నిత్యా మీనన్: అమ్మడు మలయాళంలో ఒకప్పుడు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు మలయాళంలో గ్లామర్ చిత్రాలు చేసింది. మంచి పర్ఫార్మర్ అనే పేరుతో అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. కథ బాగా నచ్చితే గానీ సినిమా ఒప్పుకొని నిత్యా..చేసింది తక్కువ సినిమాలే అయినా ఇక్కడ మంచి క్రేజ్ ఉంది. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, సన్నాఫ్ సత్య మూర్తి లాంటి సినిమాలు నిత్యాకు క్రేజ్‌ను తీసుకొచ్చాయి. ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో మంచి హిట్ అందుకుంది.
సంయుక్త మీనన్: మలయాళంలో గ్లామర్ బ్యూటీగా మంచి క్రేజ్ ఉన్న ఈ బ్యూటీని త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశాడు. గురూజీ తీసుకొచ్చారంటే గ్యారెంటీగా అమ్మడికి ఇక్కడ మంచి లైఫ్ ఉంటుందనడం లో సందేహం లేదు. ఇప్పుడు కొత్త చిత్రాలు కమిటయింది కూడా. వీరే కాదు మరి కొంత మంది మలయాళ ఉండస్ట్రీ నుంచి ఇక్కడికి వచ్చి స్టార్ హీరోయిన్స్‌గా వెలుగుతున్నారు. అయితే, దీనికి కారణం మలయాళం, కన్నడ ఇండస్ట్రీలలో రెమ్యునరేషన్ హీరోయిన్స్‌కు చాలా తక్కువ. అక్కడితో పోల్చుకుంటే మన దగ్గర రెండు హిట్స్ పడితే కోట్లలో రెమ్యునరేషన్ అందుకునే అవకాశాలుంటాయి. అందుకే, వారు ఇక్కడికి వచ్చేందుకు తెగ ఆరాట పడుతుంటారు. అంతేకాదు, మంచి పర్ఫార్మెన్స్ తోనూ ఆకట్టుకుంటున్నారు. ఇది మరో ముఖ్య కారణం మన మేకర్స్ మలయాళ భామల ఆసక్తి చూపడానికి.