Success story: ఒక‌ప్పుడు ఇడ్లీ, దోశల పిండి అమ్మ‌కం.. ఇప్పుడు 2000 కోట్ల కంపెనీకి అధిప‌తి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Success story: ఒక‌ప్పుడు ఇడ్లీ, దోశల పిండి అమ్మ‌కం.. ఇప్పుడు 2000 కోట్ల కంపెనీకి అధిప‌తి..!

 Authored By nagaraju | The Telugu News | Updated on :5 September 2021,11:13 am

Success story: ఉద్యోగం, వ్యాపారం..! ఈ రెండింటి మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంటుంది. వ్యాపారం చేస్తే.. స‌క్సెస్ అయితే ఆర్థికంగా అంద‌లం ఎక్కవ‌చ్చు. విఫ‌ల‌మైతే ఆర్థిక న‌ష్టాల్లో కూరుకుపోవ‌చ్చు. కానీ ఉద్యోగం చేసేవాళ్ల‌కు అప్ప‌టిక‌ప్పుడు అంద‌లం అందదు.. ఆర్థిక న‌ష్టం ఉండ‌దు. అందుకే చాలా మంది దొరికిన ఉద్యోగాలు చేస్తూ జీవితం వెళ్ల‌దీస్తుంటారు. కొంద‌రు రిస్క్ తీసుకుందామ‌నుకున్నా పెట్టుబ‌డి ఉండ‌దు. మ‌రికొంద‌రు అప్పు చేసైనా వ్యాపారం మొద‌లుపెడుతారు.

ఇలా ఎవ‌రు ఏం చేసినా వ్యాపారం ఎంపిక‌, నిర్వ‌హ‌ణ విష‌యంలో ప‌ర్‌ఫెక్ట్‌గా ఉన్న‌వాళ్ల‌కు వైఫ‌ల్యం ద‌రిచేర‌ద‌ని క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే ముస్త‌ఫా ప‌ర్‌ఫెక్ట్‌గా వ్యాపారం నిర్వ‌హించి స‌క్సెస్ అయిన‌వాడే. అత‌నికి చిన్న‌త‌నం నుంచే బిజినెస్ చేయాల‌నే కోరిక బ‌లంగా ఉండేది. ఆ కోరికే ఇప్పుడు అత‌ను వేల కోట్ల కంపెనీకి అధిప‌తి అయ్యేలా చేసింది. కేర‌ళ‌కు చెందిన ముస్త‌ఫా పేద కుటుంబం నుంచి వ‌చ్చాడు. రెక్కాడితే కాని డొక్కాడ‌ని కుటుంబం వాళ్ల‌ది. అత‌ని తండ్రి ఎంత క‌ష్ట‌ప‌డి కూలీ చేసినా మూడు పూట‌ల తిండి దొర‌క‌ని స్థితి.

ఈ క్ర‌మంలో ముస్త‌ఫా ఆరో త‌ర‌గ‌తిలో ఫెయిల్ అయ్యాడు. దాంతో చ‌దువు మానేసి తండ్రితోపాటు కూలీప‌నుల‌కు వెళ్లాడు. ఇంటిల్లిపాది క‌ష్ట‌ప‌డి ప‌నిచేసినా మూడుపూట‌లా తిండి దొర‌క‌ని ప‌రిస్థితి. అందుకే ఇక చ‌దువు అక్క‌ర్లేదు. ప‌ని చేసుకుని బ‌తుకాల్సిందే అని ముస్తఫా భావించాడు. కానీ, అత‌ని స్కూల్ టీచ‌ర్ చొర‌వ‌తో ముస్త‌ఫాకు మ‌ళ్లీ చ‌దువుకునే అవ‌కాశం ద‌క్కింది. స్కూల్ టీచ‌ర్ త‌న‌కు ప్ర‌త్యేకంగా ట్యూష‌న్లు కూడా చెప్ప‌డంతో 10వ త‌ర‌గ‌తిలో స్కూల్‌లో టాప‌ర్‌గా నిలిచాడు. ఆ త‌ర్వాత పై చ‌దువులు చ‌దివి ఉద్యోగం సంపాదించాడు. మొద‌టి నెల జీతం రూ.14,000 తండ్రి చేతుల్లో పెట్టాడు.

అలా క్ర‌మంగా ఇల్లు గ‌డువ‌డం కోసం తండ్రి చేసిన అప్పుల‌న్నీ తీర్చేశాడు. అనంత‌రం సొంతిల్లు కొన్నాడు. విదేశాల్లో అవ‌కాశం రావ‌డంతో అక్క‌డికెళ్లి ఉద్యోగం చేశాడు. ల‌క్ష‌ల జీతం వ‌స్తున్నా త‌న‌కు బిజినెస్ చేయాల‌న్న కోరిక త‌గ్గ‌లేదు. ఈ క్ర‌మంలో స్నేహితుడు ఇచ్చిన స‌ల‌హాతో విదేశాల్లో ఉంటూనే ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీని స్థాపించాడు. మొద‌ట్లో ఆ కంపెనీని ముస్త‌ఫా స్నేహితులే చూసుకునేవారు.
రోజుకు దోశ పిండి, ఇడ్లీ పిండి క‌లిపి 50 వ‌ర‌కు అమ్ముడు పోయేవి. ఆ సంఖ్య 100కు చేర‌డానికి 9 నెల‌లు ప‌ట్టింది.

Success story: వ్యాపారంలో నష్టాలు..

అయితే, ఆ త‌ర్వాత స్నేహితుల అవ‌గాహ‌నా రాహిత్యం కార‌ణంగా త‌న కంపెనీలో అమ్మే పిండిలో నాణ్య‌త లోపించింది. అమ్మ‌కాలు ప‌డిపోయాయి. దాంతో ముస్తాఫా ఉద్యోగం మానేసి ఇండియాకు వ‌చ్చాడు. త‌న ద‌గ్గరున్న డ‌బ్బుల‌న్నీ ఖ‌ర్చుచేసి వ్యాపారాన్ని స‌రిదిద్దాడు. చేతిలో డ‌బ్బుల‌న్నీ అయిపోవ‌డంతో ఒక ద‌శ‌లో పనివాళ్ల‌కు జీతాలు కూడా ఇవ్వ‌లేక‌పోయాడు. అయినా, వెన‌క్కి త‌గ్గ‌కుండా వెనుకో ముందో స‌ర్దుబాటు చేసుకుంటూ ఎనిమిదేండ్ల‌పాటు కంపెనీని కొన‌సాగించాడు.

ఈ క్ర‌మంలో ఓ బ‌డా పెట్టుబ‌డిదారు అత‌ని కంపెనీలో 2000 కోట్ల రూపాయ‌లు ఇన్వెస్ట్ చేశాడు. దాంతో ముస్త‌ఫా కంపెనీ రూపురేఖ‌లే మారిపోయాయి. కంపెనీ పెద్ద‌ద‌యింది. సేల్స్ పెరిగాయి. మొద‌టి నుంచి త‌న‌తోపాటు ప‌నిచేసిన మ‌రో 25 మంది ఉద్యోగులు ల‌క్షాధికారులు అయ్యారు. ఇప్పుడు ముస్త‌ఫా కంపెనీలో కొన్ని వంద‌ల మంది ప‌నిచేస్తున్నారు. అమ్మ‌కాలు ప‌డిపోగానే కంపెనీని మూసేసి ఉంటే ముస్త‌ఫా ఇంత ఎత్తుకు ఎదిగేవాడు కాదు. లోపాలు స‌రిదిద్దుకుంటూ క‌ష్టాలు ఓర్చుకున్నాడు కాబ‌ట్టే విజ‌యం తీరానికి చేరాడు.

nagaraju

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది