Weight Loss Tips : బరువు తగ్గాలనే పేరుతో భోజనం మానేస్తున్నారా..? ఇది మిమ్మల్ని నెమ్మదిగా డేంజర్ వైపు నడిపిస్తుంది!

Weight Loss Tips : బరువు తగ్గాలనే పేరుతో భోజనం మానేస్తున్నారా..? ఇది మిమ్మల్ని నెమ్మదిగా డేంజర్ వైపు నడిపిస్తుంది!

 Authored By suma | The Telugu News | Updated on :23 January 2026,7:00 am

ప్రధానాంశాలు:

  •  Weight Loss Tips : బరువు తగ్గాలనే పేరుతో భోజనం మానేస్తున్నారా..? ఇది మిమ్మల్ని నెమ్మదిగా డేంజర్ వైపు నడిపిస్తుంది!

Weight Loss Tips: ఈ రోజుల్లో ఫిట్‌గా కనిపించాలనే ఆలోచనతో చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి భోజనం మానేయడం లేదా రోజంతా ఆకలితో ఉండటమే సరైన మార్గమని అనుకుంటున్నారు. “తక్కువ తింటే వెంటనే బరువు తగ్గుతాం” అనే అపోహ చాలా మందిలో బలంగా చేసుకుంది. కానీ నిజానికి ఇది శరీరానికి మేలు చేయదు సరికదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఆకలితో ఉండటం వల్ల తాత్కాలికంగా బరువు తగ్గినట్టు అనిపించినా లోపల శరీరం నష్టపోతూ ఉంటుంది.

Are you skipping meals in the name of losing weight This is slowly leading you towards danger

Weight Loss Tips : బరువు తగ్గాలనే పేరుతో భోజనం మానేస్తున్నారా..? ఇది మిమ్మల్ని నెమ్మదిగా డేంజర్ వైపు నడిపిస్తుంది!

Weight Loss Tips: ఆకలితో బరువు తగ్గితే నిజంగా ఏమి జరుగుతుంది?

భోజనం మానేసినప్పుడు లేదా చాలా తక్కువగా తిన్నప్పుడు శరీరానికి కావాల్సిన శక్తి అందదు. అప్పుడు శరీరం తనకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవడం ప్రారంభిస్తుంది. మొదటగా కొవ్వు కాదు నీరు మరియు కండరాలే కరుగుతాయి. అందుకే తొలినాళ్లలో బరువు తగ్గినట్టు కనిపిస్తుంది. కానీ ఇది ఆరోగ్యకరమైన తగ్గుదల కాదు. కండరాలు తగ్గిపోవడం వల్ల శరీరం బలహీనమవుతుంది. అలసట, తలతిరగడం, చేతులు కాళ్లు వణకడం, ఏ పనీ చేయలేని స్థితి ఏర్పడుతుంది. అంతేకాదు శరీరానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు అందకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. చిన్నపాటి జబ్బులే పెద్ద సమస్యలుగా మారుతాయి. తరచూ జలుబు, జ్వరం రావడం మొదలవుతుంది. అంటే బరువు తగ్గాలనే ప్రయత్నం చివరకు అనారోగ్యానికి దారి తీస్తుంది.

Weight Loss Tips: జీర్ణవ్యవస్థ, జీవక్రియపై పడే ప్రభావాలు

నిరంతరం ఆకలితో ఉండటం జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కడుపులో ఆహారం లేకపోయినా ఆమ్లం ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. దీని వల్ల ఆమ్లత్వం, గ్యాస్, కడుపు మంట, నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొందరిలో మలబద్ధకం మరికొందరిలో విరేచనాలు మొదలవుతాయి. ఈ సమస్యలు ఒకసారి అలవాటు అయితే దీర్ఘకాలం వెంటాడతాయి. ఇక మరో పెద్ద సమస్య జీవక్రియ (మెటబాలిజం) నెమ్మదించడం. శరీరానికి ఆహారం అందకపోతే ఆహారం కొరత ఉంది అని భావించి శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా కొద్దిగా తిన్నా బరువు పెరిగే పరిస్థితి వస్తుంది. ఒకసారి ఆకలితో బరువు తగ్గి, తర్వాత మళ్లీ సాధారణంగా తినడం ప్రారంభిస్తే, గతం కంటే ఎక్కువ కొవ్వు శరీరంలో నిల్వ అవుతుంది. దీంతో బరువును నియంత్రించడం మరింత కష్టమవుతుంది.

Weight Loss Tips: హార్మోన్లు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం

ఉపవాసం లేదా అతిగా తినకపోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత చెదిరిపోతుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. నెలసరి సక్రమంగా రాకపోవడం, జుట్టు ఎక్కువగా రాలడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు మొదలవుతాయి. అలాగే చిరాకు, కోపం, ఆందోళన పెరుగుతాయి. మనస్సు చంచలంగా మారుతుంది. ఏకాగ్రత తగ్గి పనిలో ఆసక్తి పోతుంది. నిద్రపై కూడా దీని ప్రభావం పడుతుంది. సరైన ఆహారం లేకపోవడం వల్ల నిద్ర పట్టకపోవడం లేదా మధ్యలో లేవడం జరుగుతుంది. దీర్ఘకాలంగా ఇలా కొనసాగితే డిప్రెషన్, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి మానసిక సమస్యలు కూడా రావచ్చు. బరువు తగ్గడం అనేది భోజనం మానేయడం కాదు సరైన ఆహారాన్ని సరైన పరిమాణంలో తీసుకోవడం. మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా ఆహారాన్ని నియంత్రించాలి. ఆకలిగా ఉన్నంత మేరకే తినాలి ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలి. క్రమంగా జీవనశైలిలో మార్పులు చేస్తేనే బరువు స్థిరంగా ఆరోగ్యకరంగా తగ్గుతుంది. ఆకలితో సన్నబడటం కాదు తెలివిగా తింటూ ఆరోగ్యంగా ఉండటమే నిజమైన విజయం.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది