Health Benefits : ఇంటి ఆవరణలో ఉండే ఈ మొక్క గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు…
Health Benefits : గడ్డిచామంతి మొక్క పేరు వినే ఉంటారు. ఈ మొక్కలు ఎక్కువగా గ్రామాలలో పొలాల గట్ల మీద, ఇంటి ఆవరణలో, మన ఇంటి చుట్టుపక్కల కనిపిస్తాయి. ఈ మొక్క సుమారు రెండు అడుగుల పొడవు ఉండి రెమ్మలు నలువైపులా ఉంటాయి. ఈ మొక్కలు గుంపులు గుంపులుగా వందల సంఖ్యలో కనిపిస్తాయి. గడ్డి చామంతి మొక్క యొక్క శాస్త్రీయ నామ ట్రయిడాక్స్ ప్రోకంబన్స్. ఇంగ్లీష్ లో మెక్సికన్ డైసీ, కోట్ బటన్స్ అని పిలుస్తారు. హిందీలో ఘమ్రా, సంస్కృతంలో జయంతి వేదా అని కూడా పిలుస్తారు. అలాగే ఈ గడ్డి చామంతిని పలక ఆకు అని కూడా పిలుస్తారు. మన చిన్నతనంలో ఎక్కువగా మట్టి పలకలు ఉండేవి. పలకల మీద ఈ గడ్డి చామంతి మొక్క ఆకు రాస్తే పలక నల్లగా, కొత్తదాని లాగా కనిపించేది. అందుకే దీనిని పలక మొక్క అని కూడా అంటారు. అలాగే గడ్డి చామంతిని తెలంగాణలో నల్లారం అని కూడా పిలుస్తారు.
కానీ కొంతమంది ఈ గడ్డి చామంతి మొక్కను పిచ్చి మొక్క అని అనుకుంటారు. కానీ మొక్క గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి పెరట్లో కూడా పెంచుకుంటారు. ఈ మొక్కను ప్రాచీన కాలం నుంచి వైద్యశాస్త్రంలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఈ గడ్డి చామంతి మొక్క గురించి బాగా తెలుసు. మీరు పొలాల్లో పని చేసేటప్పుడు అకస్మాత్తుగా ఏదైనా గాయం తగిలితే ఈ మొక్క ఆకులను నలిపి రసాన్ని దెబ్బ తగిలిన చోట రాస్తారు. ఇలా రాయటం వలన రక్తం కారడం ఆగుతుంది. అలాగే నొప్పి కూడా తగ్గుతుంది. అందుకే రైతులు దీనిని వైద్యుడిగా పరిగణిస్తారు. గడ్డి చామంతి ఆకులలో ఆల్కలాయిడ్స్, ప్లవనాయిడ్స్, కేరోటినాయిడ్స్ ఉంటాయి. అలాగే సోడియం, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటాయి.
గడ్డి చామంతి ఆకులు యాంటీ సెప్టిక్ లక్షణాలు మరియు అయోడిన్ ను కలిగి ఉండడం వలన గాయాలు తొందరగా మానుతాయి. గడ్డి చామంతి ఆకుల రసాన్ని ఒక దివ్య ఔషధము గా పరిగణిస్తారు. ఈ ఆకు రసం దగ్గు, ఆయాసం వంటి వాటికి బాగా పనిచేస్తుంది. ఒక స్పూన్ గడ్డి చామంతి ఆకు రసంలో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే దగ్గు ఆయాసం తగ్గుతాయి. అలాగే చర్మవ్యాధుల సమస్యలకు ఈ ఆకు రసం ఎంతో సహాయపడుతుంది. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు వచ్చినప్పుడు ఈ ఆకు రసాన్ని చర్మ పై రాస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి. అలాగే మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు గడ్డిచామంతి ఆకులను ఎండబెట్టి పొగ పెడితే దోమలు పారిపోతాయి. అలాగే గడ్డిచామంతిలో జేర్యలోనిక్ అనే రసాయనం ఉంటుంది. ఇది చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. కనుక డయాబెటిస్ తో బాధపడే వారు ఈ ఆకు రసాన్ని సేవించడం మంచిది.