Hyderabad Metro : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు విస్తరించనున్న హైదరాబాద్ మెట్రో.. ఎప్పుడు ప్రారంభం కానుందంటే?
Hyderabad Metro : దేశంలోనే ఢిల్లీ తర్వాత ఎక్కువ కిలోమీటర్లకు విస్తరించిన మెట్రో హైదరాబాద్ లో ఉంది. ఇప్పటికే రెండు మెట్రో ప్రాజెక్టులకు ఎల్ అండ్ టీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తాజాగా మెట్రో రైలు ప్రాజెక్ట్ ను మరింత విస్తరింపజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. దానిలో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైలు ప్రాజెక్ట్ ను విస్తరించేందుకు కసరత్తులు చేస్తోంది. వచ్చే నెల డిసెంబర్ 9న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు హైదరాబాద్ మెట్రోను విస్తరించనున్నారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే ఈ మెట్రో ప్రాజెక్ట్ ను టేకప్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అంచనా వ్యయం రూ.6250 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పటికే రాయదుర్గం వరకు మెట్రో అందుబాటులో ఉంది. దానికి కొనసాగింపుగా మెట్రోను శంషాబాద్ విమానాశ్రయం వరకు పెంచనున్నారు.
Hyderabad Metro : రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు 31 కిమీలు
రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు 31 కిలోమీటర్ల దూరం ఉంది. దీనికి ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో అని పేరు పెట్టారు. మైండ్ స్పేస్, గచ్చిబౌలి, నానక్ రాంగూడ జంక్షన్ల నుంచి ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైలును నిర్మించనున్నారు. ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్ట్ ను నిర్మించారు. రెండో దశలోనే రాయదుర్గం నుంచి విస్తరించనున్నారు. అలాగే.. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో వరకు 5 కిలోమీటర్లను కూడా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకపూల్ వరకు అంటే 26 కిలోమీటర్ల దూరాన్ని మియాపూర్, హఫీజ్ పేట, గచ్చిబౌలి, మెహిదీపట్నం మీదుగా విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.