Hyderabad..అధికార ప్రతినిధులను నియమించిన టీపీసీసీ చీఫ్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్(టీపీసీసీ)గా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ నేతలు కృషి చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ సూచన మేరకు టీపీసీసీ నూతన అధికార ప్రతినిధులను నియమించింది. ఐదుగురు సీనియర్ నేతలు, ఎనిమిది మంది అధికార ప్రతినిధులతో పాటు ఒక సమన్వయకర్తను నూతనంగా నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ అధికార ప్రతినిధులు ప్రతీ విషయంలో తమ పార్టీ వాదనను వినిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ తరఫున టీవీ డిబేట్స్‌లో పాల్గొంటారు. ఇకపోతే సీనియర్ అధికార ప్రతినిధుల్లో బెల్లయ్య నాయకర్, సిరిసిల్ల రాజయ్య, హరి వర్ధన్‌రెడ్డి, అద్దంకి దయాకర్, నేరేళ్ల శారద ఉన్నారు. అధికార ప్రతినిధుల్లో ఎండీ రియాజ్, రవళిరెడ్డి, మానవతారాయ్, కైలాష్ నేత, కల్వసుజాత, రామచంద్రారెడ్డి, చారగొండ వెంకటేశ్, సంకేపల్లి సుధీర్ రెడ్డి ఉన్నారు.