Amaravati.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. 481 డైరెక్టర్ల నియామకం..
వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బలహీన వర్గాలను ముందుకు తీసుకురావడమే సీఎం జగన్ లక్ష్యమని, వారి అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
గత ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ల నియామకం ఊసే లేదని విమర్శించారు. టీడీపీ పార్టీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంక్‌గానే చూసిందని ఆరోపించారు. అయితే, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ డైరెక్టర్ల నియామకంలో అన్ని వర్గాలకు పెద్దపీట వేశారని చెప్పారు. సామాజిక న్యాయం అమలయ్యే విధంగా చూశారని తెలిపారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు ఇచ్చారని, మహిళలకు 52 శాతం అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఇకపోతే ఓసీలకు 42 శాతం పదవులిచ్చినట్లు వివరించారు. బలహీన వర్గాలకు సీఎం జగన్ భరోసా ఇచ్చారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి సుచరిత చెప్పారు. ఈ మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు.