Krishna.. గవర్నర్‌తో ఇండోనేషియా కాన్సుల్ జనరల్ భేటీ..
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనో భేటీ అయ్యారు. శనివారం రాజ్ భవన్‌లో వీరిరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. అగస్ పి.సప్టోనోకు ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్‌తో అగస్ పి.సప్టోనో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆంధ్రప్రదేశ్ గురించి పలు విషయాలు వివరించారు.
ఏపీ దేశంలోనే రెండవ పొడవైన తీరప్రాంతం, సమృద్ధిగా సహజ వనరులతో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉందని ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్‌కు చెప్పారు. ఏపీ సర్కారు పెట్టుబడిదారులకు పలు రాయితీలు అందిస్తోందని చెప్పారు. భేటీ అనంతరం గవర్నర్ హరిచందన్ అగస్ పి. సప్టోనోను జ్ఞాపికతో సత్కరించారు. ఇకపోతే టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ తరఫున పతకాలు సాధించిన విజేతలను గవర్నర్ హరిచందన్ అభినందించారు. పారాలింపిక్స్‌లో క్రీడాకారులు భారత్ సత్తా చూపించారని కొనియాడారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ప్రకటన విడుదల చేశారు.