Krishna..బీజేపీ నేతలు మత రాజకీయాలు మానుకోవాలని మంత్రి హితవు
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కులమతాలకు అతీతంగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. బీజేపీ నేతలు మత రాజకీయాలు చేస్తున్నారని, వాటని మానుకోవాలని మంత్రి హితవు పలికారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వ ఆదేశాలతోనే రాష్ట్రంలో గణేశ్ చతుర్థి వేడుకలపై డెసిషన్ తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.
కమలం పార్టీ నేతలకు హిందూమతంపై గౌరవం ఉంటే గతంలో ఆలయాలను కూల్చిన టీడీపీని ప్రశ్నించేవారని విమర్శించారు. బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకే రాష్ట్రప్రభుత్వం వినాయక చవితి వేడుకలు, ఉత్సవాలపై నిర్ణయం తీసుకుందని తెలిపారు. బీజేపీ నేతలు వైసీపీ సర్కారుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మతం ముసుగులో పాలిటిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ సర్కారు కానీ, నేతలు కానీ వినాయక చవితి జరుపుకోవద్దని చెప్పలేదని తెలిపారు.