Nepal Earthquake : నేపాల్ లో భారీ భూకంపం.. 128 మంది మృతి
ప్రధానాంశాలు:
లామిదండా ప్రాంతంలో భూకంప కేంద్రం
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
సహాయక చర్యలు ముమ్మరం
Nepal Earthquake : నేపాల్ లో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా రాత్రి భూకంపం రావడంతో నేపాల్ ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. శుక్రవారం రాత్రి అందరూ పడుకున్నాక 6.4 తీవ్రతతో జాజర్ కోట్ జిల్లాలో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 128 మంది మరణించారు. జాజర్ కోట్ తో పాటు రుకుమ్ జిల్లాలోనూ ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 140 మందికి పైగా గాయాలయ్యాయి. భూకంప కేంద్రం జాజర్ కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు వెంటనే క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రులకు పంపించాయి. దేశంలో ఉన్న మూడు భద్రతా ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. క్షతగాత్రులు ఎక్కువగా దైలేఖ్, సల్యాన్, రోల్పా జిల్లాలో ఉన్నట్టు తెలుస్తోంది. అందరినీ జాజర్ కోట్ లో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత సంవత్సరమే నేపాల్ లో జరిగిన భూకంపం వల్ల ఆరుగురు మృతి చెందారు. కానీ.. 2015 లో జరిగిన భారీ భూకంపం వల్ల 12 వేల మంది చనిపోయారు. అప్పుడు 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.