Weather Report : ఈ సారి ముందుగానే రానున్న నైరుతి రుతుపవనాలు.. సాధారణం కంటే ఎక్కువ వర్షాలు..!
ప్రధానాంశాలు:
Weather Report : ఈ సారి ముందుగానే రానున్న నైరుతి రుతుపవనాలు.. సాధారణం కంటే ఎక్కువ వర్షాలు..!
Weather Report : తెలుగు రాష్ట్రాలలో కొద్ది రోజులుగా ఎండలు దంచుతున్నాయి. ఈ సమయంలో చల్లని కబురు ఇది. మరో నాలుగైదు రోజుల్లో మేఘ సందేశం రానుంది. ఎండ వేడితో, ఉక్కపోతతో ఉస్సూరుమంటున్న ప్రజలని నైరుతి రుతుపవనాలు పలకరించబోతున్నాయి.. విపరీతమైన ఎండలు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి పలకరిస్తుందంటోంది. ఈనెల 19వ తేదీన అండమాన్ నికోబార్ దీవులను నైరుతి రుతు పవనాలు తాకుతుందని అంటున్నారు.మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది.
Weather Report చల్లని వార్త..
లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు-సెప్టెంబరు కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని తెలిపింది. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌లో విత్తనాలు వేసే జూన్, జులై నెలలు చాలా కీలకమని సంబంధిత శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అన్నారు. భారత వాతవరణ శాఖ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. మొదటిసారి ముందుగా 1918లో మే 11నే ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972 జూన్ 18న ప్రవేశించాయి. ఇక గతేడాది జూన్8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి తాకాయి.
ఈ ఏడాది సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీర్ఘకాల సగటు LPAతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. వచ్చే సీజన్‌లో LPA 87 సెంటీమీటర్లగా అంచనా వేసింది. లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండడం వల్ల ఆగస్టు- సెప్టెంబరు నాటికి ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని, వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఉంటుందంటున్నారు నిపుణులు.