Farmers Tractor Rally : ఎర్రకోట ఘటన తర్వాత మిస్సయిన 100 మంది రైతులు? వాళ్లంతా ఏమైనట్టు?
గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ రణరంగంలా మారింది. తుఫానులా దూసుకొచ్చిన రైతులు.. ఎర్రకోట మీద విరుచుకుపడ్డారు. ట్రాక్టర్ ర్యాలీ పేరుతో రైతులు చేసిన ర్యాలీ కూడా హింసాత్మకంగా మారింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. ఎర్రకోట ఘటన తర్వాత పోరాటం చేస్తున్న రైతుల్లో సుమారు 100 మంది దాకా కనిపించడం లేదట. అదే ఇప్పుడు పెద్ద షాకింగ్ న్యూస్. వాళ్లంతా ఏమైనట్టు.. అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
ఎర్రకోట ఘటనలో పాల్గొన్న వాళ్లే మిస్సింగ్?
ఎర్రకోట ఘటన తర్వాత కూడా నిరసనల్లో అందరు రైతులు పాల్గొన్నారని.. తర్వాత 100 మంది దాకా రైతులు కనిపించడం లేదని.. పంజాబ్ మానవ హక్కుల సంస్థ ప్రకటించింది. వీళ్లలో పంజాబ్ లోని తతారీవాలా అనే ప్రాంతానికి చెందిన వాళ్లు 12 మంది ఉన్నారని ఆ సంస్థ తెలిపింది.
అయితే ర్యాలీలో పాల్గొన్న తర్వాత ఆచూకీ లేని వాళ్ల జాబితా తమకు కూడా చేరిందని.. దానిపై మేం కూడా దృష్టి సారించామని.. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు బల్బీర్ సింగ్ స్పష్టం చేశారు.
అయితే.. ట్రాక్టర్ ర్యాలీ పేరుతో ఎర్రకోటపై దూసుకువచ్చి.. ఎర్రకోటపై రైతుల జెండాను ఎగురవేశారని.. నిరసనకారులపై పోలీసులు కేసులు పెట్టారు. సుమారు 400 మంది నిరసనకారులు.. పోలీసుల నిర్బంధంలో ఉన్నారంటూ కొందరు రైతులు చెబుతున్నారు. ఆ రైతులను అక్రమంగా నిర్బంధించి తీహార్ జైలుకు తరలించారంటూ చెబుతున్నారు.
ట్రాక్టర్ల ర్యాలీలో హింసకు కారణమైన 18 మంది రైతుల అరెస్ట్
అలాగే.. ట్రాక్టర్ల ర్యాలీని హింసాత్మకంగా మార్చిన 18 మంది రైతులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ.. మిస్సయిన ఆ 100 మంది ఆచూకీ మాత్రం ఎక్కడా తెలియడం లేదు. దీనిపై తాము కూడా విచారణ జరుపుతున్నామని రైతు ఉద్యమ నాయకులు చెబుతున్నారు.