Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామానికి బంపర్ గిఫ్ట్.. అదనంగా 300 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
Revanth Reddy | తెలంగాణ ప్రభుత్వం మరోసారి పేదల పక్షాన ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 300 ఇళ్లు మంజూరు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ గ్రామం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉండటం విశేషం.
కొండారెడ్డిపల్లికి ప్రత్యేక మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఇళ్ల మంజూరు, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది. తొలి విడతలో 4.5 లక్షల గృహాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించింది.ఇందిరమ్మ పథకంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం విడతల వారీగా రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తోంది.
ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గానికి మంజూరైన 3,500 ఇళ్లకు అదనంగా, సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి ప్రత్యేకంగా 300 ఇళ్లు మంజూరు చేయడం గమనార్హం. ఈ అదనపు ఇళ్లతో స్థానికులకు మరింత ఊరటనిచ్చే అవకాశం ఉంది.ఇదే సమయంలో, లబ్ధిదారులకు ప్రభుత్వం చెల్లింపులు త్వరగా, పారదర్శకంగా చేరేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జరిగే అన్ని చెల్లింపులు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ABPS) ద్వారా ప్రాసెస్ చేయనున్నట్టు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ MD వీపీ గౌతమ్ తెలిపారు.ఈ సిస్టం ద్వారా బిల్లుల చెల్లింపులో జాప్యాలు తగ్గుతాయని, బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమయ్యే విధంగా వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.