Adilabad : అభివృద్ధిలో ఆదర్శంగా కన్నెపల్లి గ్రామం.. రెండుసార్లు ఏకగ్రీవ పంచాయతీగా గుర్తింపు
Adilabad : ఆదిలాబాద్ జిల్లాలోని దండేపల్లి మండలంలో ఉన్న కన్నెపల్లి అనే గ్రామం అభివృద్ధిలో తెలంగాణకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఈ గ్రామం రెండు సార్లు ఏకగ్రీవ పంచాయతీగా గుర్తింపు పొందింది. ఈ ఊళ్లో ప్రతి ఇంట్లో ఒక మరుగు దొడ్డి, ఇంకుడుగుంత ఉన్నాయి. అలాగే.. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఉన్నాయి.
ప్రతి వాడలోనూ సీసీ రోడ్లు, మురుగు కాలవలను కూడా తవ్వారు. ప్రతి రోజు గ్రామ పంచాయతీ సిబ్బంది చెత్తను సేకరించి.. డంప్ యార్డ్ కు తరలిస్తున్నారు. గ్రామంలో వైకుంఠధామం కూడా పూర్తయింది.పల్లె ప్రకృతి వనం, ఇతర పనులన్నీ ఈ గ్రామంలో పూర్తయ్యాయి. అందుకే ఈ గ్రామం నూటికి నూరు శాతం అభివృద్ధి చెందిన గ్రామంగా చరిత్రకెక్కింది.
ఓవైపు పచ్చదనం మరోవైపు గ్రామంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. కన్నెపల్లి గ్రామ జనాబా 1500 కాగా.. అక్కడ వార్డుల సంఖ్య 10. అలాగే గ్రామంలో ఉండే మెయిన్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. అవి కూడా పెద్దగా పెరిగి కనువిందు చేస్తున్నాయి.