Paper Tea: న్యూస్ పేపర్‌లో చాయ్.. అదిరిపోతున్న టేస్ట్.. ఎగబడుతున్న జనాలు..!
Paper Tea: కాగితపు గిన్నెలో చాయ్ తయారీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? కాగితపు గిన్నెలో చాయ్ తాయారీ ఏంటీ అనుకుంటున్నారా..? కాగితపు గిన్నెలో పొయ్యి మీద పెడితే కాలిపోదా..! దానిలో పాలు, నీళ్లు పోస్తే తడిసిపోదా..! అనే సందేహం కలుగుతున్నదా..? అయితే పాలు, నీళ్లు పోసినా కాగితం తడిసిపోకుండా.. పొయ్యి మీద పెట్టినా కాలిపోకుండా చాయ్ చేయవచ్చని నిరూపించాడు.. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హన్నూ భాయ్. మరి పేపర్ గిన్నెలో చాయ్ తయారీకి హన్నూ భాయ్ దగ్గర ఉన్న మంత్రం ఏందో తెలుసుకుందామా..?
సాధారణంగా ఎవరైనా లోహపు పాత్రలో చాయ్ తయారు చేస్తారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలోని చాందాటి గ్రామానికి చెందిన హన్నూ భాయ్ కాగితపు పాత్రలో చాయ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. హన్నూ భాయ్ చాయ్‌కి స్థానికంగా చాలా డిమాండ్ ఉన్నది. షేక్ హన్నూ గత 20 ఏండ్లుగా చాయ్ తయారు చేస్తున్నారు. అయితే ఒకసారి ఓ ఆదివాసి గూడెంలో మోదగాకుల్లో చాయ్ తయారు చేయడాన్ని ఆయన చూశారు.
Paper Tea: డిఫరెంట్‌గా ఉండాలని ప్రయత్నించి సక్సెస్..
దాంతో తాను కూడా రోజూ ఎప్పటిలాగే కాకుండా డిఫరెంట్‌గా చాయ్ తయారు చేయాలని హన్నూ భాయ్ నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే కాగితాన్ని పాత్రలా చుట్టి, దానిలో పాలు, నీళ్లు పోసి చాయ్ తయారీకి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం సక్సెస్ కావడంతో హన్నూభాయ్ చాయ్‌కి డిమాండ్ అమాంతం పెరిగింది. తన పేపర్ చాయ్ చాలా రుచిగా ఉంటుందని, అందుకే చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా తన దగ్గర చాయ్ కోసం వస్తారని హన్నూ భాయ్ చెబుతున్నాడు.
హన్నూభాయ్ కాగితపు పాత్రలో చాయ్ తయారు చేస్తానంటే ముందుగా ఎవరూ నమ్మలేదట. కాగితపు పాత్ర నిప్పుల మీద పెడితే కాలిపోకుండా ఉంటుందా..? అని ఎగతాళి చేశారట. కానీ, హన్నూ భాయ్ వాళ్ల కండ్ల ముందే పేపర్ బౌల్‌లో చాయ్ తయారుచేసి చూపించేసరికి ఆశ్చర్య పోయారట. ఇప్పుడు ఆ చాయ్ రుచికి అలవాటు పడిన తర్వాత అడిగి మరీ పేపర్ పాత్రలో చాయ్ తయారు చేయించుకుంటున్నారట.
Paper Tea: కాగితం కాలకపోవడం వెనుక సైంటిఫిక్ రీజన్..
అయితే, కాగితపు పాత్రను నిప్పులమీద పెట్టినా కాలిపోకపోవడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉందని అంటున్నారు అదిలాబాద్ జిల్లాకు చెందిన సైన్స్ ఆఫీసర్ రఘు రమణ. తడి, పొడి కాగితాల జ్వలన ఉష్ణోగ్రతల్లో తేడా ఉంటుందని ఆయన తెలిపారు. హన్నూ భాయ్ కాగితపు పాత్రలో పాలు, నీళ్లు పోసి నిప్పులపై పెడుతున్నారని, దాంతో కాగితం తడిసి దాని జ్వలన ఉష్ణోత్ర పెరుగుతుందని, ఆ కారణంగానే కాగితం కాలిపోకుండా ఉంటుందని రఘు రమణ వివరించారు.