Adilabad : బాసర ఆలయం హుండీ కానుకల లెక్కింపు
Adilabad : ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో ఉన్న సరస్వతీ అమ్మవారి గుడిలోని హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను తాజాగా లెక్కించారు. దాదాపు మూడు నెలలకు సంబంధించిన కానుకలను తాజాగా ఆలయం చైర్మన్ శరత్, ఈవో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది కానుకలను లెక్కించారు.
దాదాపు మూడు నెలల కానుకలను లెక్కించగా.. 36 లక్షల 90 వేల రూపాయల నగదు వచ్చినట్టు ఈవో వెల్లడించారు. డబ్బులతో పాటు.. బంగారం 51 గ్రాములు, వెండి కిలో 790 గ్రాములు, కొన్ని విదేశీ కరెన్సీలు హుండీలో లభ్యం అయినట్టు వాళ్లు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఓసారి బాసర అమ్మవారి గుడిలోని హుండీని లెక్కించడం సంప్రదాయంగా వస్తోందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.
అలాగే.. బాసర సరస్వతీ అమ్మవారి గుడిలో ఉన్న మహంకాళీ అమ్మవారికి బోనాలు సమర్పించారు. బాసరకు చెందిన గ్రామస్తులు బోనంతో ఊరేగింపుగా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. నైవేద్యం సమర్పించి.. పట్టు చీరలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకొని.. అందరినీ చల్లగా చూడాలంటూ అమ్మవారిని వేడుకున్నారు.