Ambati Rambabu : అంబటి రాంబాబు చిరకాల కోరిక తీర్చనున్న వైఎస్ జగన్..!
Ambati Rambabu : వైఎస్సార్సీపీ వాయిస్ ని స్పష్టంగా, గట్టిగా వినిపించే వ్యక్తుల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసన సభ్యుడు అంబటి రాంబాబు తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ఆయన ఏమాత్రం కన్ఫ్యూజన్ కి గురికాకుండా క్లారిటీగా మాట్లాడతారు. అపొజిషన్ పార్టీ కౌంటర్లకు ఎన్ కౌంటర్లు, సెటైర్లకి కామెడీతో కూడిన పంచ్ లు వేయటం అంబటి అవలీలగా చేస్తారు. ఆయన చేసే ప్రతివిమర్శలకు అవతలి పక్షం వాళ్లు కూడా నవ్వాపుకునేవారు కాదు. కర్ర విరక్కుండా, పాము చావకుండా ఇరువర్గాలకు ఇబ్బంది కలగకుండా అంబటి చేసే కామెంట్లు హైలైట్ గా నిలుస్తాయి. అసెంబ్లీలో అయినా, బయట మీడియాతో మాట్లాడేటప్పుడైనా ఆయన తనదైన శైలిలో హావభావాలు ప్రదర్శిస్తుంటారు. తద్వారా పబ్లిక్ ని సైతం ఆకట్టుకుంటారు. జగన్ పార్టీకి ఒక పెట్టని కోటగా ఉన్న అంబటి రాంబాబుకు సరైన గుర్తింపు, ప్రాధాన్యత లభించిందా అంటే లేదనే సమాధానమే వస్తుంది.
ఈసారైనా.. తీరేనా?..
అంబటి రాంబాబుకి జగన్ కేబినెట్ లో మొదటిసారే చోటు దక్కుతుందని అంచనా వేసినా కుదరలేదు. కాబట్టి రెండోసారైనా మంత్రి అవ్వాలనుకునే ఆయన కోరిక నెరవేరుతుందా అంటే ప్రస్తుతానికి ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇది జరగాలంటే చాలా సమీకరణలను చూడాల్సి ఉంటుంది. ముందుగా జిల్లా కోటా, ఆ తర్వాత క్యాస్ట్, వ్యక్తిగత సమర్థత, రాజకీయ ప్రయోజనాలు, పార్టీలో సీనియారిటీ వంటివాటిని లెక్కలోకి తీసుకుంటారు. ఈ అంశాలన్నింటిలోనూ అంబటికి ఎలాంటి ఆటంకాలూ లేవు. పైగా తాను మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదని, ఇదే లాస్ట్ ఛాన్స్ అని చెబుతున్నారు. కాబట్టి తనను ఈసారి ఎలాగైనా మంత్రిగా తీసుకోవాలని సీఎం జగన్ ని కోరుతున్నారు.
1989 నుంచి.. ఇప్పటివరకు..: Ambati Rambabu
అంబటి రాంబాబు తొలిసారి 1989లో రేపల్లె నుంచి శాసన సభ్యుడిగా గెలిచారు. మధ్యలో మూడు సార్లు పోటీ చేసినా నెగ్గలేకపోయారు. 30 ఏళ్ల తర్వాత 2019లో రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ముద్ర పడ్డారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచే ఆయనకు నమ్మినబంటుగా మెలిగారు. జగన్ కి సైతం మొదటి నుంచి అండగా ఉంటున్నారు. ప్రజల్లో ఆదరణ ఉంది. 2014 ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ మళ్లీ టికెట్ ఇచ్చి అక్కున చేర్చుకున్న జగనన్న.. కేబినెట్ లోకి కూడా తీసుకుంటారని అంబటి ఆశ పెట్టుకున్నారు. ఏపీలో త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుందన్న వార్తల నేపథ్యంలో ఈ ఊహాగానాలు వెలువడుతున్నాయి.