Bandi Sangrama Yatra : బండి సంగ్రామ యాత్ర.! మూడోది ముగిసింది, నాలుగోది మొదలవనుంది.!
Bandi Sangrama Yatra : ఎట్టకేలకు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకూ చోటు లేకుండా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా ముగిసింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భద్రకాళి దేవస్థానం వరకు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టారు బండి సంజయ్. ఈ క్రమంలో బండి సంజయ్ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మీద అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారుల నుంచి బీజేపీ కార్యకర్తలపై దాడుల్ని కూడా చవిచూడాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముందుకు నడవడం కష్టమన్న అభిప్రాయాలూ సర్వత్రా వ్యక్తమయ్యాయి.
అయితే, గ్రామ గ్రామాన ప్రజలతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ, ఆయా వర్గాలకు ఎడా పెడా హామీలు గుప్పిస్తూ బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను ఎలాగైతేనేం విజయవంతంగా పూర్తి చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్‌లో జరిగిన బహిరంగ సభకు పెద్దయెత్తున జనం తరలి వచ్చారు కూడా.
బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతున్న సమయంలోనే తెలంగాణ బీజేపీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు బీజేపీలో చేరారు. మునుగోడు శాసనసభ సభ్యత్వానికి అలాగే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
మునుగోడులో నిర్వహించిన భారీ బహిరంగ సభ ద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరగా, ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కావడం గమనార్హం. మొత్తమ్మీద, బండి సంజయ్ పేరు తెలంగాణ రాజకీయాల్లో మార్మోగిపోయింది గత కొద్ది రోజులగా. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి చేసిన బండి సంజయ్, నాలుగో విడత పాదయాత్ర త్వరలో ప్రారంభమవుతుందని ప్రకటించడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం, తమ పాదయాత్రకు ఆటంకాలు సృష్టించగా, కోర్టును ఆశ్రయించి పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేశామని బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.