AP Politics : బీజేపీ, టీడీపీ మరియు జనసేన.! సీట్ల పంపకాలు ఎలా.?
AP Politics : జనసేన పార్టీకి ఓ పాతిక సీట్లు బిచ్చమేస్తామన్నట్లుగా టీడీపీ నేతలు కొంత కాలంగా మాట్లాడుతోన్న సంగతి తెలిసిందే. అయినాగానీ, జనసేన పార్టీ మాత్రం టీడీపీ మీద విమర్శలు చేయలేకపోతోంది. సొంతంగా తామే ఎన్నికల బరిలోకి దిగుతామని జనసేన పార్టీ కుండబద్దలుగొట్టలేని పరిస్థితిని చూస్తున్నాం. రాష్ట్రంలో అస్సలేమాత్రం ఓటు బ్యాంకు లేని బీజేపీ కూడా, ‘మా పార్టీలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారు..’ అంటూ మిత్ర పక్షం జనసేన పార్టీని ర్యాగింగ్ చేస్తోంది. అసలు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు అవకాశమే ఇచ్చేది లేదు.. వచ్చే ఎన్నికల్లో మొత్తంగా 175 సీట్లు గెలుస్తామన్నది అధికార వైసీపీ ధీమా. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన జతకట్టేందుకు రంగం సిద్ధమయ్యింది.
బీజేపీ – జనసేన ఇప్పటికే కలిసి వున్నాయి. తాజాగా టీడీపీ, ఆ రెండు పార్టీలతో కలిసేందుకు సర్వసన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. జాతీయ మీడియా ద్వారా బీజేపీ పెద్దలు లీకులు పంపుతున్నారు.. టీడీపీతో తాము పొత్తు పెట్టుకోబోతున్నట్లు. తద్వారా రాష్ట్రంలో మారే రాజకీయ సమీకరణాలకు సంబంధించి సర్వేలు చేయించుకోవడానికి బీజేపీకి వీలుపడుతుంది. అలాగే, టీడీపీ.. దాంతోపాటుగా జనసేన కూడా.. తమ పరిస్థితేంటన్నదానిపై ఓ అవగాహనకు రావొచ్చు. స్థానిక ఎన్నికల్లో ఆ మూడు పార్టీలకూ చుక్కలు చూపించామని వైసీపీ చెబుతోంది. అయితే, స్థానిక ఎన్నికలు వేరు, సార్వత్రిక ఎన్నికలు వేరు. బీజేపీ రాజకీయాలు ఎలా వుంటాయో గడచిన ఎనిమిదేళ్ళుగా చూస్తూనే వున్నాం.
చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్ని బీజేపీ కుప్ప కూల్చింది. అయితే, వైసీపీని దెబ్బ తీయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలపడేది ఏమీ వుండదు. సో, అంత రిస్క్ తీసుకుని వైసీపీని దెబ్బ తీయాలని బీజేపీ అనుకోకపోవచ్చు. కానీ, సంఖ్యా పరంగా అసెంబ్లీ అలాగే పార్లమెంటులో ఏపీ నుంచి ప్రాతినిథ్యం కోసం బీజేపీ ఖచ్చితంగా టీడీపీతో జతకట్టే అవకాశాలున్నాయి. 100 సీట్ల వరకు టీడీపీ, మిగిలిన డెబ్భయ్ ఐదు సీట్లు జనసేన, బీజేపీ పంచుకునేలా ఆ మూడు పార్టీల మధ్యా ఒప్పందం కుదరవచ్చు.