Delhi : చంద్రబాబు, నరేంద్ర మోడీ, వైఎస్ జగన్.. ఈ ఢిల్లీ రాజకీయమేంటబ్బా.?
Delhi : ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ పాల్గొని, నీతి అయోగ్ ముందర రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల్ని ప్రస్తావించారు. నీతి అయోగ్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం వహించిన విషయం విదితమే. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ, వైఎస్ జగన్ మధ్య మాటా మంతీ జరిగింది. వైఎస్ జగన్ భుజం తట్టి మోడీ ప్రోత్సహిస్తున్నట్లుగా ఓ ఫొటో బయటకు వచ్చింది. అంతకు ముందు, ప్రధాని నరేంద్ర మోడీని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కలిశారు.
కేంద్ర ప్రభుత్వం, ఆజాదీ కా అమృత మహోత్సవ్ ఉత్సవాల్ని నిర్వహిస్తున్న దరిమిలా, దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య మాటా మంతీ నడిచాయి. చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోడీ కరచాలనం కూడా చేశారు.
ఇక్కడ రెండు ముఖ్యమైన పొలిటికల్ డెవలప్మెంట్స్ రాష్ట్రానికి సంబంధించి ఢిల్లీలో జరిగాయి. ఒకటి ప్రధానితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ. ఇంకోటి అదే ప్రధానితో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి భేటీ. రెండూ అధికారిక కార్యక్రమాలే. రెండూ దేశానికి సంబంధించిన కార్యక్రమాలే. ఇవి పూర్తిగా అధికారిక కార్యక్రమాలు. ఈ సమావేశాల్లో రాజకీయాలకు తావుండదు.
అయితే, ప్రధాని నరేంద్ర మోడీని చాలాకాలం తర్వాత చంద్రబాబు కలిశారనీ, బీజేపీ – టీడీపీ మధ్య మళ్ళీ స్నేహం చిగురిస్తోందనడానికి ఇదే నిదర్శనమనీ టీడీపీ అను‘కుల’ మీడియా ప్రచారం చేస్తోంది. అంతే కాదు, ‘ఢిల్లీకి వస్త వుండండి, నన్ను కలుస్తూ వుండండి..’ అని చంద్రబాబుతో నరేంద్ర మోడీ చెప్పినట్లుగా ఆ మీడియాలోనే వార్తలొచ్చాయి. ఇంతకన్నా భావదారిద్ర్యం ఇంకేమన్నా వుంటుందా.? ఇప్పుడేమీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగడంలేదు. పైగా, టీడీపీ అంటే బీజేపీకి ఒళ్ళు మంట.. అనే స్థాయిలో వుంది పరిస్థితి. ఓ అధికారిక కార్యక్రమంలో ప్రధాని, చంద్రబాబుని కలిశారంతే. ఇక్కడ రాజకీయ వైరాలు అప్రస్తుతం. మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అక్కడితో కథ అయిపోయింది. ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. అది వేరే సంగతి.