Eatala : ఈటల బీజేపీలో చేరితే ఎవరికి లాభం?.. ఈటలకా?.. బీజేపీకా?..
Eatala : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇవాళ సోమవారం రెండు ముఖ్య సంఘటనలు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. ఒకటి.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారని. రెండు.. టీపీసీసీకి కొత్త అధ్యక్షుణ్ని ప్రకటిస్తారని. తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ లో నెల రోజులకు పైగా నానుతున్న పేరు ఈటల రాజేందర్. ఆయన ఈరోజు కమలం పార్టీ కండువా కప్పుకోవటం ఖాయమైన నేపథ్యంలో దీనివల్ల ఎవరికి ఎక్కువ లాభం అనే చర్చ మొదలైంది. ఈటల రాజేందర్ కాషాయం పార్టీ తీర్థం పుచ్చుకోవటం వల్ల ఇద్దరికీ లాభమేనని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. కాకపోతే ఈటల రాజేందర్ కి తెలంగాణ బీజేపీ ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆయన ఇంకా ఎక్కువ ఉత్సాహంగా పనిచేయటానికి వీలుంటుందని చెబుతున్నారు.
విశ్వసనీయత ఎక్కువ..
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో హుజూరాబాద్ లో ఉపఎన్నిక తప్పకుండా జరుగుతుంది. ఆ ఎలక్షన్ లో ఈటల గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ వీక్ గా ఉన్నా క్యాండేట్ మంచోడైతే విజయం సాధించటానికి ఎక్కువ అవకాశం ఉంది. దుబ్బాకలో జరిగిందదే. రఘునందనరావు మంచి అభ్యర్థి కావటంతో అక్కడ టీఆర్ఎస్ క్యాండేట్ పై సానుభూతి సైతం పని చేయలేదు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపుతుందో తెలియదు గానీ దానికి ఏవిధమైన సానుభూతీ పనిచేయదు. సానుభూతి మొత్తం ఈటల రాజేందర్ కే సొంతమవుతుంది.
ఎందుకు?..: Eatala
ఈటల రాజేందర్ ని సీఎం కేసీఆర్ తన కేబినెట్ నుంచి కావాలనే, ఉద్దేశపూర్వకంగానే తొలగించారనే సంగతి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకే కాదు తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతోంది. ఈటల రాజేందర్ ని మంత్రివర్గం నుంచి తొలగించటానికి ప్రధాన కారణంగా అతను భూకబ్జాలకు పాల్పడ్డాడనే అంశాన్నే చూపుతున్నారు. కానీ దాన్ని ఎవరూ నమ్మట్లేదు. ఎందుకంటే ఈటల రాజేందర్ అన్ని ఎకరాల భూమిని నిజంగా కబ్జా చేసిండనే అనుకుందాం. అయితే ఆ సంగతి ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలియకుండానే జరిగి ఉంటుందా అనే డౌటు చాలా మందికి వస్తోంది. ఏమీ తెలియనట్లు సీఎం కేసీఆర్ ఇప్పుడు తీరిగ్గా ఈటలపై వేటు వేయటం సరికాదని అంటున్నారు. కాబట్టి హూజూరాబాద్ బైఎలక్షన్ లో అధికార పార్టీ ఆగడాలు నడవవని జనం తేల్చిచెబుతున్నారు.
పార్టీ పగ్గాలూ..
ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో విజయం సాధించాక తెలంగాణ బీజేపీ పగ్గాలను కూడా ఆయనకే అప్పగిస్తే ఆ పార్టీకి మరింత లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే బండి సంజయ్ కన్నా ఈటల రాజేందరే తెలంగాణ రాజకీయాల్లో సీనియర్. పైగా మొన్నటి వరకు సీఎం కేసీఆర్ పక్కనే ఉండి వచ్చాడు. వాళ్లిద్దరి మధ్య అనుబంధం 17 ఏళ్లు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ లోని ప్లస్ లూ, మైనస్ లూ బండి సంజయ్ కన్నా ఈటలకే ఎక్కువ తెలుసు. అంతేకాదు. బండి సంజయ్ కన్నా ఈటలే ఇంకాస్త బాగా బీజేపీ వాయిస్ ని తెలంగాణ ప్రజలకు వినిపించగలడని చెబుతున్నారు. కాకపోతే రైతుబంధు వంటి స్కీమ్ ని విమర్శించిన ఈటల రాజేందరే దాని నుంచి లబ్ధి పొందారనే సంగతి ఆయన టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాక వెలుగులోకి రావటం కొంచెం ఇబ్బందికరమేనని చెప్పొచ్చు.