Pk Plan : వైఎస్ జగన్ , పీకేల మధ్య చెడిందా..? ఈసారి తెలంగాణలో అడుగుపెడుతోన్న పీకే..!
Pk Plan : ప్రశాంత్ కిషోర్ (పీకే) గురించి తెలుగువారికి కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావటానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి తెర వెనక పనిచేసిన టీమ్ పీకేదే. లేటెస్టుగా పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మూడోసారి నెగ్గటానికి, తమిళనాడులో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మొదటిసారి సక్సెస్ సాధించటానికి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించింది కూడా పీకేనే. అంతెందుకు 2014లో కేంద్రంలో మోడీ తొలిసారి ప్రధానమంత్రి అవటంలో పొలిటికల్ స్ట్రాటజీ ప్లే చేసిందీ ప్రశాంత్ కిషోరే కావటం విశేషం. అయితే అదే పీకే ఇప్పుడు అదే మోడీని గద్దె దించటానికి జాతీయ స్థాయిలో మూడో కూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ వరసపెట్టి కలుస్తున్నాడు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తో..
పీకే త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా భేటీ అయ్యే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో టచ్ లో ఉన్నాడని అంటున్నారు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి పీకే సీఎం కేసీఆర్ తో చర్చించకపోవచ్చు. సీఎం కేసీఆర్ కూడా పీకేని వాటి గురించి అడగకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణ పాలిటిక్స్ పై ప్రస్తుతం సీఎం కేసీఆర్ కి ఉన్నంత పట్టు బహుశా పీకేకి కూడా లేకపోవచ్చు. కాకపోతే గతంలో కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ కొంత వరకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని సైతం సీఎం కేసీఆర్ చాలా సార్లు తప్పుపట్టారు. కాబట్టి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అందుకే పీకే.. సీఎం కేసీఆర్ ని కలుస్తారని పేర్కొంటున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నో..: Pk Plan
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీతో క్లోజ్ గా ఉంటున్నాడని ఎల్లో మీడియా తనకు అలవాటైన కథలు చెబుతోంది. సీబీఐ, ఈడీ కేసుల మాఫీ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమల నాథులతో సన్నిహితంగా ఉంటున్నారని దుష్ప్రచారం చేస్తోంది. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలో చేరకపోవచ్చని, ఈ నేపథ్యంలో పీకే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం కాడని అంటోంది. కానీ అది ఎంత వరకు నిజమో కాలమే చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యాడని, అందుకే అతనికి బెయిల్ వచ్చిందని కూడా పచ్చ మీడియా అప్పట్లో రాసుకొచ్చింది. నరం లేని నాలుక నాలుగు విధాలుగా మాట్లాడుతుంది కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా గురించి పట్టించుకోవాల్సిన పనిలేదని పొలిటికల్ పెద్దలు సూచిస్తున్నారు.